నానాటికి విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరంలోని ప్రధాన రోడ్లను 120 అడుగుల మేరకు పెంచేందుకు బల్దియా స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. ఇక నుంచి కొత్తగా జారీ చేసే భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి రోడ్డును 120 అడుగుల మేరకు వదిలిన తరువాతే నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. ఇప్పటికే నిర్మించుకున్న భవనాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఫిబ్రవరి 6, బుధవారంనాడు స్థాయీ సంఘం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ప్రధాన రోడ్లను 120 అడుగుల మేరకు చేయాలన్న పట్టణ ప్రణాళిక విభాగం ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో భాగంగా దాదాపు 20కిపైగా రోడ్ల విస్తరణకు సభ్యులు తీర్మానం చేశారు. దీంతోపాటు కిషన్‌బాగ్-జియాగూడ మధ్య మూసీనదిపై బ్రిడ్జిని నిర్మించేందుకు కూడా ఆమోదం తెలిపారు. వీటితోపాటు పలు కీలక తీర్మానాలు చేశారు.
స్థాయీసంఘంలో తీసుకున్న ముఖ్య తీర్మానాలు
> మూసీపై జియాగూడ-కిషన్‌బాగ్ మధ్య 18మీటర్ల బ్రిడ్జి నిర్మాణం, ఆస్తుల సేకరణ
> అరబిందో నవయుగ సెజ్ నుంచి వయా నార్నే లేఔట్ మీదుగా చందానగర్ రైల్వేస్టేషన్ వరకు రోడ్డును 45 మీటర్ల మేరకు విస్తరణ. భూసేకరణకు చర్యలు
> హైటెక్‌సిటీ ఫేస్-2 నుంచి గచ్చిబౌలి ఇనార్బిట్ రోడ్ వరకు రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> బయోడైవర్సిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి వయా అరబిందో ద్వారా గౌసియా మజీద్‌రోడ్ వరకు రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> నోవాటెల్ నుంచి ఆర్‌టీఏ ఆఫీసు వరకు రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> ప్రగతినగర్ చెరువు నార్త్ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోని బోరంపేట వరకు రేడియల్‌రోడ్డు నిర్మాణానికి ఆస్తుల సేకరణ
> మెట్రో సూపర్‌మాల్ నుంచి వయా హెచ్‌టీ లైన్ ద్వారా జగద్గిరిగుట్ట జంక్షన్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> జేవీ హిల్స్ నుంచి వయా ప్రభుపాద లేఔట్ హెచ్‌టీ లైన్ మార్గంలో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> గోపన్‌పల్లి నుంచి వయా ప్రణీత్‌ప్రణవ్ రోడ్ ద్వారా విప్రో వరకు మదీన హెచ్‌పీ పెట్రోల్‌బంక్ మార్గంలో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> క్రాంతివనం లేఔట్ నుంచి భాగ్యలక్ష్మి లేఔట్‌ను కలుపుతూ నార్నే రోడ్డు వరకు విస్తరణ, ఆస్తుల సేకరణ
> బాపూఘాట్ బ్రిడ్జి నుంచి మూసీ రివర్ సౌత్ ప్యారాలాల్ అత్తాపూర్ ఫ్లైఓవర్ వరకు రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> మల్కాపురం చెరువు నుంచి వయా చిత్రపురి కాలనీ ద్వారా ఖాజాగూడ మెయిన్‌రోడ్డు వరకు రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> మియాపూర్ మెట్రో డిపో నుంచి వయా ఐడీపీఎల్ ఎంప్లాయీస్ కాలనీ, శ్రీలాపార్కుప్రైడ్, ప్రతిపాదిత ఆర్‌వోబీ ద్వారా కొండాపూర్ మజీద్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> నిజాంపేట్ క్రాస్ రోడ్డు నుంచి వయా వసంతనగర్ ద్వారా హైటెక్‌సిటీ వరకు రోడ్డు విస్తరణ, ఆస్తులసేకరణ
> వెస్ట్రన్ హోటల్ నుంచి మాదాపూర్ మెయిన్‌రోడ్డు వరకు రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> నాచారం మల్లాపూర్ నుంచి ప్రతిపాదిత మౌలాలి ఫ్లైఓవర్ వరకు 30 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ
> ప్రధాన కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంతోపాటు ఖైరతాబాద్ సర్కిల్ కార్యాలయం ఆధునీకరణ ప్రతిపాదనకు ఆమోదం
> లీగల్ అడ్వైజర్ సేవలను ఏడాది పాటు పొడిగింపు
> జీహెచ్‌ఎంసీ క్రీడా ప్రాంగణాల్లో నెలవారీ సభ్యత్వ రుసుమును పునర్ వ్యవస్థీకరించుటకు ఆమోదం
> వైద్యాధికారులు, హెల్త్ అసిస్టెంట్లను పారిశుధ్య పనుల నుంచి మినహాయించి ఫుడ్‌సేఫ్టీ, బస్తీ దవాఖానలు తదితర ఆరోగ్యపరమైన బాధ్యతలకు పరిమితం చేయడం
> వైద్యాధికారులు నిర్వహిస్తున్న పారిశుధ్య విధులను పూర్తిగా పర్యావరణ ఇంజినీర్లు, మున్సిపల్ ఇంజినీర్లకు అప్పగింత
> పటాన్‌చెరు సర్కిల్‌లో 41 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపు
> డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు హయత్‌నగర్ మండలంలోని ఫతుల్లగూడలో ఖాళీ జాగా కేటాయింపు
> జీహెచ్‌ఎంసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ, నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు సాంకేతిక సేవలకింద మూడేండ్ల కాలానికి 22 మాడ్యూల్స్‌కు రూ. 5,97,58,842 చెల్లింపునకు ఆమోదం.