జంతు ప్రేమికులను.. జంతువులను చూసి కేరింతలు కొట్టే చిన్నారులను.. అలరించడానికి నెహ్రూ జూలాజికల్ పార్కులో జిరాఫీ జంట బయల్దేరింది. ఈ జంట సోమవారం మార్చి 4న ప్రయాణాన్ని మొదలుపెట్టి అదే రోజు సాయంత్రానికే బెంగాల్ దాటి ఒడిశా చేరుకుంది. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌లోని పార్కుకు వచ్చేందుకు దాదాపు 5 రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు.
1500 కిమీల ప్రయాణం చేస్తున్న మగ, ఆడ జిరాఫీలకు ఇబ్బంది కలగకుండా మధ్యలో వైజాగ్‌లోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద కాసేపు ఆపనున్నారు. వాటి సంరక్షులతో పాటు పోలీసు సిబ్బంది జంతువులు ప్రయాణించే వాహనాన్ని అనుసరించనున్నారు.
అసలు మార్చి 1నే ఈ ప్రయాణం మొదలుకావాల్సి ఉంది. కానీ, కోల్‌కతా వర్షం పడుతుండటంతో వాతావరణం అనుకూలించక ప్రయాణం వాయిదా పడింది. ఒడిశాలోని నందనకనన్ జూ సిబ్బంది ప్రయాణం మధ్యలో అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు చేరతాయి. ఆ తర్వాత బయల్దేరి హైదరాబాద్ కు చేరుకోనున్నాయి.
ఈ ప్రయాణంలో 13అడుగుల ఎత్తు ఉన్న మూడున్నర సంవత్సరాల మగ జిరాఫీ, 12 అడుగుల ఎత్తుతో రెండున్నర సంవత్సరాలున్న ఆడ జిరాఫీలు ప్రయాణిస్తున్నాయి. రోడ్ మరమ్మతులు, రోడ్ సర్వేలు వంటి ఆటంకాలేమీ లేని దారిని ఎంచుకుని రెండు జిరాఫీలను రవాణా చేయనున్నారు.