ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. సమ్మెపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని తెలిపింది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. సమ్మెపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. విచారణకు సీఎస్ జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు హాజరవగా… అధికారులిచ్చిన నివేదికలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న న్యాయస్థానం… ఐఏఎస్ అధికారులే ఇలాంటి నివేదికలు ఇస్తే ఎలా అని ప్రశ్నించింది. చాలా తెలివిగా గజిబిజి లెక్కలు చూపారని… ఇంతవరకు ఏ బడ్జెట్‌లోనూ ఇలాంటి లెక్కలు చూడలేదని సీరియస్ అయింది. ఈ నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌ను అదేశించింది.
స్వయంగా హైకోర్టు వివరణ ఇచ్చిన ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు… రికార్డులన్నీ పరిశీలించాకే నివేదిక ఇచ్చామని చెప్పారు. దీంతో న్యాయస్థానం ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మొదటి నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా అంటూ మొట్టికాయలు వేసింది. ఆర్టీసీ ఎండీ లెక్కలు వేరేలా… మీ అంకెలు వేరేలా ఉన్నాయని.. వేటిని పరిగణనలోకి తీసుకోవాలని ఫైరయింది.
దీంతో… తక్కువ సమయంలో… తమ దగ్గరున్న రికార్డుల ఆధారంగా మొదటి నివేదిక ఇచ్చామని… దీనికి తమను మన్నించాలని కోర్టును కోరారు రామకృష్ణారావు. దీనిపై స్పందించిన న్యాయస్థానం… క్షమాపణ కోరడం సమాధానం కాదని.. కోర్టులకు వాస్తవాలు మాత్రమే చెప్పాలని సీరియస్ అయింది.
ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదికను సైతం హైకోర్టు తప్పుబట్టింది. మీ నివేదిక ముఖ్యమంత్రిని, మంత్రులను కూడా తప్పుదోవ పట్టించేలా ఉందన్న కోర్టు… మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు ఆర్టీసీ ఎండీనే అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. రవాణాశాఖ మంత్రితో అసెంబ్లీ వేదికగా తప్పుడు గణాంకాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తంచేసింది. అసెంబ్లీలో చెప్పిందే నిజమైతే.. మీరిచ్చిన నివేదిక అంతా తప్పవుతుంది కదా అని సునీల్‌శర్మను నిలదీసింది.మీ బాస్‌కే తప్పుడు సమాచారం ఇచ్చిన వారు… మాకు నిజాలు చెబుతున్నారంటే ఎలా నమ్మాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అందరినీ తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఎండీని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఇచ్చేదేమీ లేదన్నపుడు… నిధులు ఇవ్వాలని ఎందుకు అడుగుతున్నారని.. జీహెచ్‌ఎంసీ ఇంకా ఇవ్వాల్సి ఉందని మంత్రికి ఎలా చెప్పారని నిలదీసింది. జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ ఎండీ, ఆర్థిక శాఖలు ఒక్కో లెక్క చెబుతున్నారని, హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించింది.
తన సర్వీసులో ఇంత దారుణంగా తప్పుడు వివరాలు సమర్పించిన ప్రభుత్వ అధికారులను చూడలేదని హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచారంతో ముఖ్యమంత్రిని, కేబినెట్‌ను, ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు తాము ప్రయత్నిస్తుంటే… ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం ముందుకు రావడంలేదని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించిందని మండిపడ్డారు.