సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో సంస్కరణలు : లాభాల బాటలో గ్రేటర్‌ హైదరాబాద్ ఆర్టీసీ

గ్రేటర్‌ హైదరాబాద్ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశంతో అధికారులు చేపట్టిన సంస్కరణలు ఆర్టీసీ చరిత్రలో గ్రేటర్‌ హైదరాబాద్‌ను లాభాల బాట పట్టిస్తోంది.

  • Publish Date - February 28, 2020 / 04:22 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశంతో అధికారులు చేపట్టిన సంస్కరణలు ఆర్టీసీ చరిత్రలో గ్రేటర్‌ హైదరాబాద్‌ను లాభాల బాట పట్టిస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశంతో అధికారులు చేపట్టిన సంస్కరణలు ఆర్టీసీ చరిత్రలో గ్రేటర్‌ హైదరాబాద్‌ను లాభాలబాట పట్టిస్తోంది. ఎటువంటి చేయూత తీసుకోకుండా స్వయంగా అడుగులు వేస్తోంది. నగరంలోని 29 డిపోల పరిధిలో తిరుగుతున్న 2,800 బస్సులు కనీవినీ ఎరుగని రీతిలో రెవెన్యూ  సాధిస్తోంది. ప్రతి ఏటా రూ.450 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్న ఆర్టీసీ 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఆశాజనకంగా పనిచేస్తోంది. ఇదే సంప్రదాయం కొనసాగితే కచ్చితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నష్టాలు లేకుండా లాభాల్లోకి రావడం ఖాయమని అధికారులు అంచనాకు వచ్చారు.

ఆదాయమార్గాల వైపు ప్రయాణం 
ఆర్టీసీలో అధికారులు, ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడటం, కండక్టర్లు, డ్రైవర్లు సీఎం చెప్పినట్లు లాభాల్లోకి తెచ్చి బోనస్‌ తీసుకుందామనే లక్ష్యంతో పనిచేస్తుండటం, ఆపరేషన్‌ రేషియో(ఓఆర్‌)ను పెంచుకోవడం వంటి చర్యలతో డిసెంబర్‌ 2019 నుంచి ఫిబ్రవరి వరకు ఆదాయం పెంచుకుంటూ వస్తోంది. పెరిగిన చార్జీలతోపాటు రూట్ల రీ షెడ్యూలింగ్‌, బస్సులు ఖాళీగా రోడ్ల మీద ప్రయాణించకుండా ప్రయాణికులు నిండుగా ఉండేట్లు, రద్దీ సమయాల్లో ఎక్కువ ట్రిప్పులు నడుపుతుండటంతో నష్టాలను తప్పించుకోవడానికి ఆదాయమార్గాల వైపు ప్రయాణిస్తోంది. 

రూ.3.27 కోట్లు పెరిగిన ఆదాయం 
సమ్మెకు ముందు 3,560 బస్సులుండగా వీటిలో కాలం చెల్లిన బస్సులను తీసివేయగా 2,800 బస్సులు మిగిలాయి. బస్సులు తగ్గినా ప్రయాణికులు తగ్గకపోవడంతోపాటు నిర్వహణ వ్యయం తగ్గడం వల్ల రెవెన్యూ ఆటోమేటిక్‌గా పెరిగింది. అంతేకాకుండా సమ్మెకు ముందు గ్రేటర్‌ ఆర్టీసీ ఆదాయం రూ.3.06 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.3.27 కోట్లకు పెరిగింది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.450కోట్ల నష్టం ప్రతీ సంవత్సరం వస్తుండగా ప్రస్తుత సంవత్సరంలో డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు పెరిగిన ఆదాయంతో రూ.380 కోట్లకు కుదించబడింది. 

ఇతర జిల్లాలకు మించి గ్రేటర్‌ ఆదాయం
ఆర్టీసీకీ గుదిబండగా మారిందని గతంలో ఉన్న విమర్శలను తిప్పికొడుతూ ఇతర జిల్లాలకు మించి గ్రేటర్‌ ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. సమ్మెకు ముందు ఎర్నింగ్‌ ఫర్‌ కిలోమీటర్‌(ఈపీకే)  కేవలం కిలోమీటరుకు వచ్చే ఆదాయం రూ.26 ఉండగా ప్రస్తుతం 6 రూపాయలు పెరిగి 32కు చేరింది. రాష్ట్రంలో ఏ జిల్లాలోను కిలోమీటరుకు ఆదాయం పెరుగలేదు. గతంలో 9,15,000 కిలోమీటర్లు  తిప్పిన బస్సులను ప్రస్తుతం 8,25,000 కిలోమీటర్లు మాత్రమే తిప్పుతున్నారు. దీనివల్ల బస్సుల నిర్వహణతోపాటు, డీజిల్‌ ఖర్చు కూడా తగ్గుతోంది. దీంతో ఆదాయం పెరుగుతోంది. 

సర్‌ప్లస్‌గా మిగిలిన 3,500 మంది ఉద్యోగులు  
అయితే ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ బస్సుల తొలిగింపు వల్ల 3,500 మంది ఉద్యోగులు సర్‌ప్లస్‌గా మిగిలారు. ఇందులో కొంతమందిని వివిధ పనులకు పురమాయిస్తున్నప్పటికీ చాలామంది సర్‌ప్లస్‌గా ఉన్నారు. దీంతో ప్రతినెలా రూ.14 కోట్ల వేతనం ఇవ్వాల్సి వస్తోంది. కండక్టర్లను ఎక్కడో దగ్గర అడ్జస్ట్‌ చేస్తున్నప్పటికీ డ్రైవర్లు ఎక్కువగా సర్‌ప్లస్‌గా ఉన్నారు. ఇది కూడా భారం కాకుండా ఉంటే మరింత ఆదాయం పెరిగేది.

ఫలిస్తోన్న సీఎం కేసీఆర్ వ్యూహం 
సీఎం కేసీఆర్ వ్యూహంతో చేపడుతున్న సంస్కరణలు ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు దోహదపడుతుందని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. నిత్యం ఆర్‌ఎంలు, డీవీఎంలు, డీఎంలతో సమీక్షలు జరుపుతూ పక్కాప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయి వాస్తావాలను ఉద్యోగుల నుంచి సేకరిస్తూ అవసరమైన రూట్లను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే ట్రెండ్‌ కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్‌ ఆర్టీసీకీ నష్టాలు రాకుండా ఉంటాయన్నారు. ఆర్టీసీకీ లాభాలు వచ్చి ఉద్యోగులు బోనస్‌ తీసుకోవడం ఖాయమన్నారు. 

See Also | ప్రేమ పేరుతో మోసం…పోలీసులకు గే ఫిర్యాదు