మనసుల్ని కదిలించిన గుండె ప్రయాణం..
- Subhan Ali Shaik
- Updated on- February 2, 2021 / 05:46 PM IST
Heart Journey: నాగోల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టుకు మెట్రోలో అక్కడి నుంచి అంబులెన్స్‌లో అపోలో హాస్పిటల్ కు గుండె ప్రయాణం జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన నర్సిరెడ్డి అనే వ్యక్తి అవయవాలను దానం చేయడంతో ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్ కామినేని నుంచి నాగోల్ మెట్రో వరకూ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి గుండెను తరలించారు.
కాలంతో పరుగులు
వైద్యులు, వైద్య సిబ్బంది సమక్షంలో తరలించిన ఆ గుండెకు సంబంధించి ప్రతి క్షణం భావోద్వేగంతో ఎదురుచూశారు. కాలంతో పరుగులు పెట్టి చేసిన ఈ ప్రయాణం ఎంతో మంది మనుసుల్ని కదలించింది. జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ నుంచి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి రోడ్ మొత్తం ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకున్నారు.
రైతు గుండె ఆగలేదు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన రైతు వరంకాంతం నర్సిరెడ్డి ఆదివారం హైబీపీతో ఎల్బీనగర్ కామినేనిలో జాయిన్ అయ్యాడు. సోమవరాం బ్రెయిన్ డెడ్ అవటంతో అవయవాలు దానం చేయవచ్చని వైద్యులు కుటుంబసభ్యులకు సూచించారు. కుటుంబ సభ్యులుకూడా అంగీకరించడంతో అపోలోలో చికిత్స పొందుతున్న పేషెంట్ కు గుండె అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.
మొత్తం 8 అవయవాలు
నర్సిరెడ్డి శరీరం నుంచి 8 అవయవాలు వైద్యులు సేకరించారు. రెండు కిడ్నీలు, రెండు ఊపిరి తిత్తులు, లివర్, కార్నియా, గుండెను కుటుంబ సభ్యులు దానం చేశారు. హైదరాబాద్ లో తొలిసారిగా ఒక వ్యక్తి ప్రాణం నిలబెట్టడానికి తమ వంతు సహాయం అందించారు.
పోలీసుల సహకారం:
ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీ హిల్స్ అపోలో వరకు మెట్రో రైలు అధికారులను సంప్రదించి.. కొంతదూరం ఆ తర్వాత రోడ్ మార్గంలో అపోలో వరకూ చేరుకున్నారు. మంగళవారం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి.. పోలీసు సిబ్బంది సహకారంతో తరలించగలిగారు. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిల్మ్ నగర్ అపోలో వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అడుగడుగునా పోలీసులు సహకారం అందించారు.
