ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ దర్యాఫ్తు జరిపించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేసిన వ్యక్తిపై కోర్టు సీరియస్
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనుమానాలు ఉన్నాయని, సీబీఐ దర్యాఫ్తుకి ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేసిన వ్యక్తిపై కోర్టు సీరియస్ అయ్యింది. అసలు ఇందులో ప్రజాప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. కోడెల ఆత్మహత్య చేసుకోలేదని, ఆయన కొడుకే కోడెలను హత్య చేసి ఉంటాడని సందేహాలు కలుగుతున్నట్లు పిటిషనర్ తన పిటిషన్ లో తెలిపారు. అయితే కోడెలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పిటిషన్‌ను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా అనుమతించలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కోడెల మృతిపై సీబీఐ దర్యాఫ్తుకి ఆదేశించాలని కోరుతూ బుర్రగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం(సెప్టెంబర్ 24,2019) మధ్యాహ్నం ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు.. కొట్టివేసింది.
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూసైడ్ ఎందుకు చేసుకున్నారు అనేది మిస్టరీగా మారింది. ఏపీలో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. ఇది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చంద్రబాబు ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వేధించి అవమానించారని.. దాంతో కోడెల చనిపోయారని చంద్రబాబు అన్నారు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.