సరదా కోసం చేసే పనులు వ్యసనంగా మారకూడదు. అవి మత్తు పదార్థాలైనా, సోషల్ మీడియా లాంటి మాద్యమాలైనా.. కొద్ది నెలలుగా ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీకి చాలా యువత బానిసలుగా మారిపోతున్నారు. దీనిపై ప్రాణాలు పోగొట్టుకునేంత వరకూ దిగజారుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఆ ఘటన విన్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది.
ఓ వ్యక్తి రాత్రి పగలు తేడా లేకుండా పబ్‌జీ ఆడి ప్రాణల మీదికి తెచ్చుకున్నాడు. దడులో రక్తస్రావం అయి కదలలేని స్థితికి వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. వనపర్తికి చెందిన 18 ఏళ్ల కేశవర్ధన్.. డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. నెలరోజులుగా పబ్‌జీ ఆడుతూ.. తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. వారం రోజుల కిందట జ్వరంతో పాటు వాంతులయ్యాయి. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చూపించినా ప్రయోజనం లేకపోయింది.
జ్వరం తగ్గకపోగా వాంతులతో డీహైడ్రేషన్ పెరిగిపోయింది. చివరికి మెదుడుపై తీవ్ర ఒత్తిడికి గురై పరిస్థితి విషమించింది. కాలు, చేయి కదపలేని స్థితికి వెళ్లిపోయాడు. బాధితుడి తల్లి ఆందోళనకు గురై ఆగష్టు నెల 26వ తేదీన సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. న్యూరో ఫిజీషియన్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం యువకుడిని ఐసీయూకు తరలించి అత్యవసరంగా చికిత్స అందించారు.
మెదడుకు రక్త ప్రసరణ చేసే నరాల్లో ఇబ్బంది రావడంతో యువకుడి ఆరోగ్య పరిస్థితి విషయమించినట్టు గుర్తించారు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి వల్ల శరీరంలో సోడియం, పోటాషియం స్థాయిలు తగ్గి అది చివరికి మెదడుపై ప్రభావం చూపినట్టు తేల్చారు. శక్తినంతా కోల్పోయి.. నీరసించిపోయిన కేశవర్ధన్ పట్ల వైద్యులు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు.