రోజురోజుకి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నా.. వారి తీరు మారడం లేదు. ఇలా రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపై అక్షరాల 2 కోట్లకు పైగా చలాన్లు విధించి.. 292 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టేందుకు అమలు చేస్తున్న చలాన్లతో ఖజనా నిండుతోంది. 2016, 2018 డిసెంబర్ నాటికి 2 కోట్లకుపైగా చలానాలు విధించారు పోలీసులు. ఇందులో ఇప్పటివరకు 99 లక్షలకుపైగా చలానాల నుంచి.. 291 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. దీంతో నగరంలో పెండింగ్ చలాన్లపై పోలీసులు నజర్ పెట్టారు.
చలాన్లు చాలాకాలంగా చెల్లించకుండా కళ్లు గప్పి తిరుగుతున్న వారిపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు పోలీసులు. పదికంటే అధికంగా చలాన్లు ఉన్న వాహనాలు కొన్నింటిని సీజ్ చేశారు. దీంతో వాహనదారులు జరిమానాలు చెల్లించక తప్పడం లేదు. పెండింగ్ చలాన్లు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై ప్రతీ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని నగర అదనపు ట్రాఫిక్ పోలీస్ కమీషనర్ అనీల్ కుమర్ తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
2016లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా 46 కోట్ల రూపాయలు జరిమానాల రూపంలో వసూలు చేశారు. 2017 నుంచి చలాన్ల సంఖ్య పెరిగింది. 2018లో 27 లక్షల చలాన్లు విధించగా 103 కోట్ల రూపాయల జరిమానాలు విధించారు. మూడేళ్ల కాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు రెట్టింపు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో జరిమానాలు వసూలు చేయడంతోనే ట్రాఫిక్ పోలీసులు సరిపెడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రించడంలో మాత్రం ఘోరంగా విఫలమతున్నారు.