Hyderabad One Way Traffic: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఈ రూట్ లో కూడా వన్‌వే విధానం.. త్వరలోనే ట్రయిల్ రన్!
హైదరాబాద్ లో ట్రాఫిక్(Hyderabad One Way Traffic) రద్దీని తగ్గించేందుకు లక్డీకాపూల్, సైఫాబాద్, రవీంద్ర భారతి మార్గాల్లో వన్‌వే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
- V Santhosh Kumar
- Updated on- November 7, 2026 / 05:30 PM IST
Hyderabad traffic police to introduce one way system at lakdikapul
Hyderabad One Way Traffic: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు సుఫీషియంట్ ట్రాఫిక్ ఫ్లో సాధించడమే లక్ష్యంగా నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే కీలకమైన లక్డీకాపూల్ జంక్షన్ పరిధిలో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించేందుకు వన్‌వే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పాత సైఫాబాద్ పిఎస్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, లక్డీకాపూల్ ఎక్స్ రోడ్స్, పాత కంట్రోల్ రూమ్ ప్రాంతాలను పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
రూట్ మ్యాప్ మార్పులు.. పాత కంట్రోల్ రూమ్ నుండి నిరంకారి జంక్షన్ వరకు డైవర్షన్లు:
కొత్తగా ప్రతిపాదించిన రూట్ మ్యాప్ ప్రకారం పాత కంట్రోల్ రూమ్ నుంచి రవీంద్ర భారతి మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్, సెక్రటేరియట్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. అలాగే సచివాలయం నుండి వచ్చే ట్రాఫిక్(Hyderabad One Way Traffic) ఇక్బాల్ మినార్ వద్ద కుడివైపునకు తిరిగి, రవీంద్ర భారతి, పాత కంట్రోల్ రూమ్ వద్ద యూ-టర్న్ తీసుకొని ముందుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. నిరంకారి జంక్షన్ నుంచి కంట్రోల్ రూమ్ వెళ్లే వాహనాలకు కూడా ప్రత్యేక మళ్లింపులు వర్తిస్తాయి.
ప్రయోగాత్మక అమలు.. ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే తుది నిర్ణయం:
ఈ రూట్ ఛేంజెస్‌ను మొదటగా ప్రయోగాత్మకంగా (Trial Basis) అమలు చేసి, వాహనదారుల ఫీడ్‌బ్యాక్, క్షేత్రస్థాయి ఫలితాల ఆధారంగా శాశ్వత నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కేబీఆర్ పార్క్ వద్ద ప్రస్తుతం ఉన్న వన్‌వే మార్గానికి అదనంగా మరో ట్రాఫిక్ లేన్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
