లేడీస్ సీట్లోంచి లేవమన్నందుకు మహిళను కత్తితో పొడిచేశాడు.ఈ ఘటన ఆదివారం రాత్రి గాంధీభవన్ సమీపంలోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటన ఆదివారం (ఫిబ్రవరి 17,2020)రాత్రి గాంధీభవన్ సమీపంలోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన అనురాధ అనే 40 ఏళ్ల మహిళ పని నిమిత్తం ఆర్టీసీ బస్సులో చాంద్రాయణగుట్ట వెళ్తోంది.
బస్సులో మహిళల సీట్లో కూర్చున్న వ్యక్తిని..ఇది మహిళలకు కేటాయించిన సీటు..సీట్ లోంచి లేవండి అని అడిగింది. నేను లేవను అని తెగేసి చెప్పాడు. లేడీస్ సీట్ లో కూర్చుని లేవనని అంటావేంటీ? అని మరోసారి అడిగింది అనూరాధ. దీంతో లేవనని చెప్పానుగా..లేవనంటే లేవను అని మరోసారి తెగేసి చెప్పాడు.
ఇలా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అప్పుడు బస్ లో 50మందికి పైగా ఉన్నారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరుగుతుంటే ఎవ్వరూ అడ్డుకోలేదు..అది లేడీస్ సీట్ కదా లేవాలి అని ఎవ్వరూ అడగలేదు. ఈ క్రమంలో సదరు వ్యక్తి కోపంతో ఊగిపోతూ..తన వద్ద ఉన్న కత్తితో అనురాధపై దాడి చేసి రన్నింగ్‌లో ఉన్న బస్సులో నుంచి దూకి పారిపోయాడు.
సదరు వ్యక్తి దాడిలో ఆమెకు గాయపడిన ఆమెను బస్ డ్రైవర్ అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఆమెను పరిశీలించిన డాక్టర్లు అంగుళం లోతు గాయమైందని తెలిపారు. వెంటనే గాయానికి 10 కుట్లు వేసి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.
ఈ ఘటనపై పి జ్ఞానేందర్ రెడ్డి మాట్లాడుతూ..రాత్రి 11గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని..ఆమెకు పొత్తికడుపు ఎడమైపు గాయమైందనీ అనురాధను ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స చేయించామని ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. ఈ ఘటన గాంధీభవన్ వద్ద జరగడంతో అఫ్జల్‌గంజ్ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.అనూరాధపై దాడికి పాల్పడిన వ్యక్తి మద్యం తాగి బస్ ఎక్కాడని అతను సికింద్రాబాద్ వెళ్తున్నాడని..ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. డ్రైవర్ ను, కండక్టర్ లను ప్రశ్నిస్తున్నామని ఆ పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.