తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అభివృద్ధిపరిచే దిశగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం రానుంది. విద్యా సంస్థల్లో ప్రయోగాత్మకంగా హాజరు శాతం పెంపొందించాలనే ఉద్దేశంతో బయోమెట్రిక్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచే ప్రతీ విద్యార్థికి ఓ గుర్తింపు కార్డ్ను కేటాయించనున్నారు.
ఆధార్ తరహాలో స్పెషల్ ఐడీ నెంబర్
ప్రభుత్వ, స్థానిక సంస్థ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ఆధార్ నంబర్ తరహాలో స్పెషల్ ఐడీ నంబర్ కేటాయించినున్నారు. స్టూడెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనే విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఈ తరహా విధానాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ (DSE) ఆన్ లైన్ చేయనుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విద్యార్ధి గుర్తింపు ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు ఇలా ఏ కాలేజీ, స్కూల్లో చేరినా.. విద్యార్థులు ఒకే ఐడీ కార్డుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
డ్రాప్ అవుట్ విద్యార్థులు, ఎంతమంది చదువుకుంటున్నారు.. ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్సఫర్ అయ్యారో గుర్తించి ట్రాక్ చేయగల మెకానిజం ఇప్పటివరకు లేదు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఈ కొత్త వ్యవస్థతో విద్యార్థుల వివరాలన్నీ గుర్తించవచ్చునని ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. ఈ స్పెషల్ ఐడీ ఆధార్-ఆధారిత నమోదు వ్యవస్థతో బయోమెట్రిక్ హాజరుతో లింక్ అయి ఉంటుంది. ఇది ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. స్కూల్స్ లో నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 96 శాతం వారి ఆధార్ వివరాలను డిపార్ట్ మెంట్ కు సమర్పించారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను 12 జిల్లాల్లో 9,349 ప్రభుత్వ పాఠశాలల్లో వినియోగిస్తున్నారు.
టీచర్లకు బయోమెట్రిక్ ఉండాల్సిందే
ప్రాధమిక, ఉన్నత ప్రాధమిక, ఉన్నత పాఠశాలలతో సహా సుమారు 25,000 పాఠశాలలు తదుపరి విద్యా సంవత్సరంలో బయోమెట్రిక్ ను వినియోగిస్తున్నారు. బయోమెట్రిక్ విధానం విద్యార్థులకే కాకుండా టీచర్లకు కూడా అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో టీచర్లు రోజుకు రెండు సార్లు బయోమెట్రిక్ ద్వారా వారి హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అధ్యాపకులు సకాలంలో కళాశాలకు హాజరయ్యేందుకు వీలుంటుంది.