ఫ్లైట్ జర్నీ’ చేయాలనుకుంటున్న ప్రయాణికులకు పెరిగిన చార్జీలు చూడగానే కళ్లు తిరుగుతున్నాయి.
హైదరాబాద్ : నగరవాసులు పల్లె బాట పట్టారు. సంక్రాంతికి సొంత ఊళ్లకు పయనమయ్యారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతోపాటు విమానాశ్రాయాలు కూడా ప్రయాణికులతో కిట కిట లాడుతున్నాయి. సంక్రాంతి రద్దీ ఆర్టీసీ బస్సులు, రైళ్లనే కాదు.. విమానాలను సైతం తాకింది. అన్ని ప్రధాన రైళ్లలో టికెట్ బుకింగ్‌లను నిలిపివేయడంతో అప్పటికప్పుడు బయలుదేరేందుకు ‘ఫ్లైట్ జర్నీ’ చేయాలనుకుంటున్న ప్రయాణికులకు పెరిగిన చార్జీలు చూడగానే కళ్లు తిరుగుతున్నాయి.
సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లేందుకు విమాన చార్జీ రూ.5వేల వరకు ఉంటుంది. కానీ ఈ నెల 12వ తేదీన ఆ ధర ఏకంగా రూ.18 వేల నుంచి రూ.47 వేలకు పెరిగింది. ఒక్కో ఎయిర్‌లైన్స్ చార్జీలు ఒక్కోవిధంగా ఉన్నాయి. అదేరోజు హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు థాయ్ ఎయిర్‌లైన్స్ చార్జీలు రూ.16,773 మాత్రమే ఉండడం గమనార్హం. న్యూఢిల్లీకి రూ.8,145 నుంచి రూ.9,191 వరకు ఫ్లైట్ చార్జీ ఉంది. 12వ తేదీన హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.9,165 నుంచి రూ.15,024 వరకు ఉంది. అలాగే రాజమండ్రికి రూ.8,672 నుంచి రూ.14,867 వరకు చార్జీలు ఉన్నాయి. ఈ విమాన చార్జీలు గురువారం సాయంత్రం నమోదైనవి మాత్రమే.
న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్ తదితర నగరాల కంటే విశాఖ, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాల చార్జీలు అధికంగా ఉండడం గమనార్హం. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఈ చార్జీలు మరింత పెరిగే అవకాశముంది. ఇటీవల వరకు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ ట్రైన్ చార్జీలను తలపించిన వివిధ ఎయిర్‌లైన్స్ అమాంతంగా చార్జీలను పెంచేసి సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొంటున్నాయి.
ఒకవైపు ప్రైవేట్ బస్సులు రెట్టింపు చార్జీలతో ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ చార్జీలను 50 శాతం పెంచారు. ‘సువిధ’ పేరుతో నడుపుతున్న రైళ్లు సైతం విమాన చార్జీల్లా పెరిగిపోతున్నాయి. మొత్తంగా నగరవాసులకు సంక్రాంతి సంబరాలు ప్రయాణాల్లోనే ఆవిరవుతున్నాయి. ఇంటిల్లిపాదీ కలిసి సొంత ఊరుకు వెళ్లి వచ్చేందుకు ఆయా రవాణా సదుపాయాల మేరకు రూ.వేలల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇకనలుగురు కుటుంబ సభ్యులు కలిసి పొరపాటున విమానంలో వెళ్లాలని కోరుకుంటే రూ.లక్షలు ధారపోయల్సిందే.
విమానం ఛార్జీలు..12వ తేదీ..