నిరాహారదీక్షకు సిద్ధమైన ఆర్టీసీ జేఏసీ నేతలు

  • Publish Date - October 5, 2019 / 01:02 PM IST

ఆర్టీసీ జేఏసీ నేతలు నిరహార దీక్షకు రెడీ అయిపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెలోకి వెళ్లినా..ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. దీంతో సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు నిరహార దీక్షకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా అక్టోబర్ 07వ తేదీ సోమవారం నుంచి ఇందిరాపార్కు వద్ద దీక్షలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. 

ఎవరి దయాదాక్షిణ్యాలపై తమకు ఉద్యోగాలు రాలేదని కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి అంటున్నారు. కార్మికులను తొలగించాలంటే ముందు తన ఉద్యోగం తీసేయాలన్నారు. శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు. రేపు ప్రతి ఆర్టీసీ డిపోల ముందు బతుకమ్మలతో నిరసన తెలియజేస్తామని చెప్పారు. 

టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విధులకు హాజరుకాని కార్మికులను తొలగించాలంటే ముందు తనను తొలగించాలన్నారు. ప్రతి రోజూ ప్రణాళికతో శాంతియుతంగా సమ్మె చేస్తామని చెప్పారు. డెడ్ లైన్ లోపు ఎంతమంది విధుల్లోకి వచ్చారని అన్నారు. 

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ శనివారం (అక్టోబర్ 5, 2019) 6 గంటలకు ముగిసింది. ఆ సమయం లోపు ఎవరైతే రిపోర్టు చేస్తారో వారే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, సమ్మెలో పాల్గొన్నవారు ఉద్యోగులు కాదని మంత్రి పువ్వాడ అజయ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ డెడ్ లైన్ ముగిసిన అనంతరం కూడా కార్మికులు ఎవరూ కూడా విధుల్లో చేరకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. 

ఇదిలా ఉంటే..కార్మికులు చేపడుతున్న సమ్మె…అనుసరించాల్సిన పరిస్థితిపై చర్చించేందుకు ప్రభుత్వం ఆదివారం (అక్టోబర్ 06, 2019) ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కార్మికులపై అనుసరించాల్సిన వైఖరిపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. 

ప్రభుత్వం డెడ్ లైన్ విధించడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పందించాయి. సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.  ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, శాంతియుతంగా డిపోల ఎదుట బతుకమ్మలతో నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. 

మరోవైపు సమ్మెతో ప్రైవేట్ వాహనాలు చెలరేగిపోయాయి. అందినకాడికి దండుకుంటున్నాయి.  రూ.100 టికెట్ కు రూ. 500 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఇంతవరకూ వేతనాలు అందలేదు.