లింగంపల్లి నుంచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు

  • Publish Date - April 16, 2019 / 02:52 AM IST

రైల్వే ప్రయాణికులు శుభవార్త. శేరిలింగంపల్లి నియోజకవర్గంతోపాటు నగరంలోని పలు నియోజకవర్గాలకు చెందిన రైల్వే ప్రయాణికులకు ఊరట లభించింది. ఏప్రిల్ 15 సోమవారం లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమైంది. ఈ రైలు ఇన్నాళ్లూ సికింద్రాబాద్‌ నుంచే మొదలయ్యేది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల ప్రజానీకం సికింద్రాబాద్‌ నుంచి వెళ్లి ఎక్కాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలో వైజాగ్‌ వరకు వెళ్లే ఈ రైలును లింగంపల్లి నుంచే నడపాలని ప్రయాణికులు, పలు సంఘాలు, నాయకులు నుంచి పెద్దఎత్తున ప్రతిపాదనలు వచ్చాయి. 

ఎట్టకేలకు ఒక్కొక్కటిగా ప్రధాన రైళ్లు లింగంపల్లి నుంచే నడిపే ప్రక్రియ అమల్లోకి రావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు జన్మభూమి రైలును లింగంపల్లికి పొడిగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు నగరానికి వెళ్లి ప్రయాణించే అవస్థ నుంచి బయటపడేసినట్లయింది. ఈ రైలు ప్రతిరోజు లింగంపల్లిలో ఉదయం 6.15గంటలకు ఆరంభమవుతుంది. రాత్రి 7.30గంటలకు వైజాగ్‌ చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం వైజాగ్‌లో 6.15గంటలకు మొదలవుతుంది. లింగంపల్లికి రాత్రి 7.40గంటలకు చేరుకుంటుంది. లింగంపల్లి నుంచి ఉదయం ఆరంభమైన రైలుకు నగరం మధ్యలో బేగంపేటలోనూ హాల్ట్‌ ఇచ్చారు.