కరోనా వార్డు గాంధీలో వద్దు.. డాక్టర్ల డిమాండ్

  • Publish Date - March 5, 2020 / 06:12 AM IST

హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో ఉన్న కరోనా రోగులపై జూనియర్ డాక్టర్లు కొత్త డిమాండ్ చేస్తున్నారు. అదేంటంటే.. కరోనా రోగుల కోసం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డును అక్కడినుంచి తీసేయాలని కోరుతున్నారు. ఈ విషయం గురించి ఈ రోజు (మార్చి 5, 2020)న ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ ను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. 

ఎందుకంటే.. గాంధీ ఆస్పత్రికి రోజూ కొన్ని వేలమంది ఇతర రోగాలతో వస్తుంటారు, వారందరికి కరోనా రోగుల వల్ల ఎలాంటి సమస్య రాకూడదని చెబుతున్నారు. కరోనా వార్డును ఇక్కడే ఉంచితే సాధారణ పేషెంట్లకు కూడా ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్డును నగర శివారు ప్రాంతాలకు తరలిస్తే, మిగిలిన వారు సురక్షితంగా ఉంటారని జూనియర్ డాక్టర్లు తెలిపారు.

అయితే  వికారాబాద్‌లోని అనంతగిరిలో కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై బుధవారమే నిర్ణయం తీసుకుంటారని భావించినప్పటికీ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ రోజు ( గురువారం) దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, కరోనా వైరస్ అనుమానంతో చాలా మంది గాంధీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. మంగళవారం మొత్తం 47 మందికి పరీక్షలు నిర్వహించగా 45 మందికి కరోనా నెగటివ్ అని తేలినట్లుగా వైద్యులు ప్రకటించారు. మరో ఇద్దరిపై అనుమానాలున్నాయి. బుధవారం 23 మంది కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు వీరికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.