గల్ఫ్‌లో కరీంనగర్‌ వాసి నరకయాతన : ఫేస్‌బుక్‌లో వీడియో

  • Publish Date - May 9, 2019 / 01:51 PM IST

బతుకుదెరువు కోసం అబుదాబి వెళ్లిన ఓ తెలంగాణవాసి అక్కడ నరకం అనుభవిస్తున్నాడు. రెండేళ్లుగా పనిచేయించుకొంటూ జీతం ఇవ్వకుండా, తిండి పెట్టకుండా అరబ్ షేక్ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోను.. నెటిజన్ ఒకరు ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపారు. వీడియోను చూసిన కేటీఆర్ తక్షణమే స్పందించి.. ఆయనను ఇండియాకు తీసుకురావడానికి సాయం చేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, అబుదాబిలో భారత రాయబారికి విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య జీవనాధారం కోసం అబుదాబి వెళ్లి.. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో ఒంటెను కాసే పనిలో కుదిరాడు. రెండేళ్లుగా జీతం ఇవ్వకుండా, తిండి పెట్టకుండా వేధిస్తున్న యజమాని చేతిలో నరకయాతన అనుభవిస్తున్నాడు.

ఇప్పుడు వీరయ్య తన గోడు వెల్లబోసుకొంటున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవడంతో ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. తాను అబుదాబికి వచ్చి రెండేళ్లు అవుతోందని.. యజమానికున్న 100 ఒంటెలను తానొక్కడినే చూసుకోవాలని వీడియోలో గోడు వెళ్లబోసుకున్నాడు. ఒక ఒంటె చనిపోవడంతో యజమాని తనను బాగా కొట్టాడని.. దాంతో దవడ పళ్లు ఊడిపోయి మాట్లాడడం కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జీతం ఇవ్వకుండా, తిండి పెట్టకుండా యజమాని తనను హింసిస్తున్నట్లు వాపోయాడు. తన తల్లి చనిపోయినా పంపించలేదని..సార్.. నన్ను ఇండియాకు తీసుకుపోండి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. 

వీరయ్య కష్టాల వీడియోను నెటిజెన్ ఒకరు ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పంపారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. వీరయ్య కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. వీడియోను కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి, అబుదాబిలో భారత ఎంబసీ అధికారులకు ట్యాగ్ చేస్తూ.. బాధితుడిని ఇండియాకు తీసుకురావడానికి సాయం చేయాల్సిందిగా కోరారు.