ఫలించిన కేసీఆర్‌ దౌత్యం : జూరాలకు నీటి విడుదలకు కర్నాటక సీఎం గ్రీన్‌సిగ్నల్‌

  • Publish Date - May 4, 2019 / 03:51 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కర్నాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని కర్నాటక సీఎం కుమారస్వామి కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌లో తెలిపారు. అనంతరం నారాయణపూర్‌ నుంచి నీటిని విడుదల చేశారు. ఫలితంగా  ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు నీరందనుంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్నాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. పాలమూరు ప్రజల మంచినీటి అవసరాల కోసం నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాభావం కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తి తగ్గిపోయింది.  దీంతో జూరాలకు  నీటిని విడుదల చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌.. కర్నాటక సీఎంను అభ్యర్థించారు. కేసీఆర్‌ వినతి మేరకు కర్నాటక అధికారులతో చర్చించిన కుమారస్వామి తెలంగాణకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా కేసీఆర్‌కు ఫోన్‌చేసి తెలిపారు. దీంతో కర్నాటక సీఎంకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగా కొనసాగాలని ఇద్దరు సీఎంలు ఆకాంక్షించారు. శుక్రవారం సాయంత్రమే కర్నాటక జల వనరులశాఖ అధికారులు నారాయణపూర్‌ నుంచి నీటిని దిగువకు వదిలారు.

వాస్తవానికి కుమారస్వామి సానుకూలంగా స్పందించడం వెనుకాల కారణం కూడా ఉంది. గత ఏడాది కర్నాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు తుంగభద్ర జలాల్లో ఆర్డీఎస్‌ వాటా నుంచి ఒక టీఎంసీని  కర్నాటక వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.  ఇప్పుడు మళ్లీ తెలంగాణ కోసం కర్నాటక  జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని ఇస్తోంది.  నారాయణపూర్‌ నుంచి జూరాలకు విడుదల చేసిన మొత్తం నీటిని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకే వినియోగించనున్నారు. రామన్‌పాడు నుంచి 6 రక్షిత మంచినీటి పథకాలకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం రామన్‌పాడు రిజర్వాయర్‌లో నీటిమట్టం 8 అడుగులకు పడిపోయింది. దీంతో రక్షిత మంచినీటి పథకాలకు నీటి విడుదల కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలకు మంచినీటి అవసరాలకు జూరాలకు విడుదలైన నీటిని వినియోగించనున్నారు. 

జూరాల ప్రాజెక్టుకు 2018-19లో వరదనీరు తక్కువగా వచ్చింది.  2017-18లో 409 టీఎంసీల వరదనీరురాగా… 2018-19లో 389.5 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది.  వచ్చిన నీటిలో శ్రీశైలానికి 339.4 టీఎంసీలు విడుదల చేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1.96 టీఎంసీల డెడ్‌ స్టోరేజీ ఉంది. దీంతో పాలమూరు వేసవిలో పాలమూరు ప్రజల గొంతెండిపోతోంది. వారి గొంతు తడపడానికి కూడా కష్టంగా మారడంతో కేసీఆర్‌ … కర్నాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కర్నాటక ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి రెండున్నర టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేసింది.