అభివృద్ధి బాటలో : సీఎంగా కేసీఆర్ పాలనకు 50రోజులు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్..

  • Publish Date - February 1, 2019 / 02:28 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్.. హోంమంత్రిగా మహమూద్ అలీతో ప్రమాణస్వీకారం చేయించారు. అప్పట్నుంచి ద్విసభ్య మంత్రివర్గమే కొనసాగుతున్నప్పటికీ.. వరుస సమీక్షలు, సమావేశాలతో కేసీఆర్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.

 

లేనిపోని ఆరోపణలతో తన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అప్రతిష్టపాలు చేస్తున్నాయని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్… అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 2018 డిసెంబర్ 13న ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్… సీఎంగా ఫిబ్రవరి 1వ తేదీ శుక్రవారం నాటికి 50రోజులు పూర్తి చేసుకున్నారు

 

కొత్త ప్రభుత్వంలో మొత్తం మంత్రివర్గం లేకపోయినా సీఎం ఒక్కరే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షన్ల పెంపుపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏప్రిల్ నుంచి అమలు చేయాలని అధికారులకు తొలి ఆదేశాలిచ్చారు. అనంతరం… ఇరిగేషన్‌పై ఫోకస్ పెట్టారు. కోటి ఎకరాలను మాగాణిగా మార్చడమే లక్ష్యమంటూ… సాగునీటి ప్రాజెక్టుల పురోభివృద్ధిని తెలుసుకునేందుకు ఫస్ట్ టూర్ చేపట్టారు. నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ అధికారులు, ఇంజినీర్లతో కలిసి తన కలల ప్రాజెక్టయిన కాళేశ్వరానికి వెళ్లారు. తన టూర్‌లో భాగంగా మొదట మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లిన ముఖ్యమంత్రి… రెండ్రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షలు జరిపారు.

 

అసెంబ్లీ సమావేశాలను సైతం ఒంటి చేత్తో నడిపించారు సీఎం కేసీఆర్. తమ ప్రభుత్వ లక్ష్యాలను గవర్నర్ చేత చెప్పించామన్న కేసీఆర్….. అధికారంలో ఉన్న పార్టీ ఆలోచనలు, ప్రణాళికలనే గవర్నర్.. సభకు వివరిస్తారని క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత ముంతాజ్‌ అహ్మద్ ఖాన్‌కి అవకాశమిచ్చి అందరికీ షాక్ ఇచ్చిన కేసీఆర్… ఆ తర్వాత స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంపికచేశారు. ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులతో స్వయంగా మాట్లాడి అందరి మద్దతును కూడగట్టగలిగారు. నామినేటెడ్ సభ్యుడిగా స్టీఫెన్ సన్‌కు మరోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్.. అందరు ఎమ్మెల్యేలతో పాటే ప్రమాణస్వీకారం చేయించారు.

 

కేబినెట్ విస్తరణపై రోజుకో రకమైన వార్తలు వస్తున్నా… ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా… అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. మొదటి విడత పాలనలో రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా మార్చిన ముఖ్యమంత్రి.. వాటిని 33కు పెంచాలని నిర్ణయించారు. ఎన్నికల సభల్లో చెప్పినట్లుగానే… మహబూబ్ నగర్‌లోని నారాయణపేట, వరంగల్ జిల్లాలోని ములుగును నూతన జిల్లాలుగా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వీటితోపాటు సంక్షేమ పథకాల్లో రాష్ట్రాన్ని టాప్ ప్లేస్‌లో నిలబెట్టిన తన కార్యాలయ బృందాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు.

 

ఇలా ఓవైపు పాలనను పరుగెత్తిస్తూనే మరోవైపు యాగాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు. జనవరి 21 నుంచి 5రోజులపాటు జరిగిన సహస్ర చండీ యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతేకాదు… యాగం నిర్వహిస్తున్న సమయంలోనే ఢిల్లీకి వెళ్లడం.. ఆ తర్వాత రెండ్రోజుల్లోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు దక్కడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోర్టులో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్‌లో నూతన సచివాలయ నిర్మాణం అంశం కూడా క్లియర్ అయ్యింది.

 

ఈ 50రోజుల్లో నీటిపారుదల రంగంతోపాటు  అటవీ సంరక్షణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అడవులను రక్షించేందుకు, స్మగ్లర్లను మరింత కఠినంగా శిక్షించేందుకు అవసరమైన కొత్త చట్టాలు తేవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కలప స్మగ్లింగ్‌కు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరికలు పంపారు. పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుభాళించింది. 12వేల పంచాయతీలకు గాను 9వేల గ్రామాలను తన ఖాతాలో వేసుకుంది. ఇదే జోష్‌ను త్వరలో జరిగే ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.