జెడ్పీ ఛైర్మన్ పదవులను క్లీన్ స్వీప్ చెయ్యాలని సీఎం కేసీఆర్ చెప్పారు. స్థానిక సమరంలో టీఆర్ఎస్ దే గెలుపు కావాలన్నారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మంత్రులదే అని చెప్పారు. ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. 3 గంటల పాటు ఈ సమావేశం సాగింది. 32 జిల్లా పరిషత్ లను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ చెప్పారు. ప్రజలు మనవైపే ఉన్నారని అన్నారు. 90శాతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2 జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆందోళన అవసరం అన్న కేసీఆర్.. 16 లోక్ సభ సీట్లను మనమే గెలవబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్ కి బ్రహ్మరథం పడతారని కేసీఆర్ అన్నారు. 32 జడ్పీ పీఠాలను, 530కి పైగా మండల పరిషత్‌లను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. నెల రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలి అన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకుని ముందుకెళ్లాలి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.