ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది.
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం కమిటీ వేయనుంది. మంత్రులు, అధికారులతో కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. మరికాసేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశముందని తెలుస్తోంది.
గతంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసుపై ఉన్నతాధికారుల బృందం చర్చలు జరిపింది. పలు దఫాలుగా జరిపిన చర్చల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అశం తెరపైకి రావడంతో చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో (అక్టోబర్ 5, 2019)న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. మంగళవారం (అక్టోబర్ 15, 2019) హైకోర్టు ఆదేశాలతో కార్మికులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఈమేరకు ఆర్టీసీ సంఘాలతో చర్చలు చేయడానికి ప్రభుత్వం కమిటీని నియమించింది.
రాబోయే 2 రోజుల్లో కమిటీ కార్మిక సంఘాలతో పూర్తిస్థాయిలో చర్చించి కోర్టుకు నివేదిక ఇవ్వాలని సూచించడంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. హైకోర్టు ప్రభుత్వానికి రెండు రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఈక్రమంలో ఈరోజు, రేపు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు మంత్రివర్గంలో కొంతమంది, ఉన్నతాధికారుల్లోని కొందరితో కలిపి కమిటీ వేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అక్టోబర్ 16న చర్చలు మొదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం విలీనం అంశం లేకుండా మిగిలిన అంశాలపై సుముఖంగా ఉన్నామని సంకేతాలిస్తుంది.
టీఎన్ జీవోలతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కార్మిక సంఘాలు టీఎన్ జీవోల మద్దతు కోరినట్లు తెలుస్తోంది. దీంతో నిన్నటి వరకు ఆర్టీసీ సమ్మెకు దూరంగా ఉన్న టీఎన్ జీవోలు కలిసి నడుస్తామని చెప్పడంతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీలైనంత త్వరలో కమిటీలోని మంత్రులు, అధికారుల బృందం కార్మిక సంఘాల నేతలతో చర్చించి సమ్మెకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.