తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం(సెప్టెంబర్ 14,2019) ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చెప్పాలని
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం(సెప్టెంబర్ 14,2019) ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చెప్పాలని సభ్యులు అడిగారు. వారి ప్రశ్నలకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేశామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52వేల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి లక్షా 10 వేల కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ఇది తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనమన్నారు.
ఐటీ పరిశ్రమలో అద్భుతమైన పురోగతిని సాధించామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నలువైపులా ఐటీని విస్తరించామన్నారు. కేటీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. అక్టోబర్ లో కరీంనగర్ లో ఐటీ టవర్ ను ప్రారంభిస్తామన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌లోనూ ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ ఐటీ టవర్‌కు టెండర్ పూర్తయిందని, 50 ఎకరాల స్థల సేకరణ జరిగిందని కేటీఆర్ వివరించారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని కేటీఆర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ లో 8శాతం వృద్ధి ఉందన్న కేటీఆర్.. తెలంగాణలో 17శాతానికిపైగా నమోదైందన్నారు.
ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) పాలసీ తీసుకొచ్చిన యూపీఏ ప్రభుత్వం ఒక్కపైసా కూడా ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక దాదాపు పదిసార్లు నేరుగా కలిసి అడిగాము, లేఖలు రాసినా లాభం లేకపోయిందన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌కు ఐటీఐఆర్ మంజూరు చేసినా.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. వారు నిధులు ఇవ్వకపోయినా ఐటీ అభివృద్ధి ఆగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలతో తెలంగాణలో ఐటీ రంగంలో 17 శాతం వృద్ధిని సాధించామన్నారు.