రిపీట్ కావొద్దు : అమీర్ పేట్ మెట్రో ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్

అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఇంజినీరింగ్‌ నిపుణులతో దర్యాప్తు చేయించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు

  • Publish Date - September 23, 2019 / 12:59 PM IST

అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఇంజినీరింగ్‌ నిపుణులతో దర్యాప్తు చేయించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు

అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఇంజినీరింగ్‌ నిపుణులతో దర్యాప్తు చేయించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎల్‌&టీ సంస్థను ఆదేశించారు. అన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణాలు, వసతులను పరిశీలించాలన్న మంత్రి కేటీఆర్‌.. ప్రయాణికుల రక్షణకు మెట్రో స్టేషన్లలో పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రమాదం అనుకోనిదే అయినా ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఆదివారం(సెప్టెంబర్ 22,2019) అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడి మౌనిక మృతి చెందడంపై కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. 

వర్షం పడుతుంటే తలదాచుకోవడానికి మౌనిక అనే వివాహిత మెట్రో స్టేషన్ కింద నిల్చుంది. అదే ఆమె పాలిట మృత్యువైంది. పెచ్చులు ఊడి తలమీద పడ్డాయి. తీవ్రగాయాలతో మౌనిక చనిపోయింది. ఈ ఘటన కలకలం రేపింది. మెట్రో స్టేషన్లలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనలో మెట్రో నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ యాజమాన్యంపై కేసు నమోదైంది. మౌనిక భర్త హరికాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాణంలో నిర్లక్ష్యం వహించి ఓ మహిళ మృతికి కారణమైన.. ఎల్‌ అండ్‌ టీ యాజమాన్యంపై 304ఎ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 304ఏ అంటే నిరక్ష్యం కారణంగా జరిగిన మరణం. మెట్రో అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక చనిపోయిందని హరికాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 

అమీర్ పేట మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడిపడి మౌనిక మృతి చెందిన ఘటనను తలుచుకుని హరికాంత్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు. మెట్రోలో వెళ్లమని తాను బలవంతం చేయడం వల్లే మౌనిక చనిపోయిందని విలపించారు. మౌనిక సోదరి ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్‌కి వచ్చింది. హాస్టల్లో ఉండి చదువుకుంటానని ఆమె చెప్పడంతో… అమీర్‌పేట్‌లోని ఓ మంచి హాస్టల్‌లో చేర్పించేందుకు మౌనిక బయల్దేరింది. ఆ తర్వాత ఊహించని ప్రమాదానికి బలైపోయింది.