ఢిల్లీ: సర్వే స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకు బయటకు వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికలపై రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలు, ఓటింగ్ శాతంపై అనుమానాలు ఉన్నందున… అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, ప్రభుత్వంపై ఉందన్నారు. వీవీ ప్యాట్‌లు ఎందుకు లెక్కించడం లేదని లగడపాటి ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్ యుగంలో గంటలో చెప్పాల్సిన పోలింగ్ శాతానికి.. రెండు రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని అడిగారు. సాయంత్రం 5 తర్వాత పోలింగ్ శాంత ఎంత మేర పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజాగా జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విపక్షం పుంజుకుందని లగడపాటి అన్నారు. కాంగ్రెస్ బలం బాగా పెరిగిందన్నారు. నెలరోజుల వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో ఇంత తేడానా అని విస్మయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా టీఆర్ఎస్ గెలిచినందున పంచాయితీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కే ఏకపక్షంగా ఫలితాలు రావాలని, ప్రతిపక్షం పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవాలన్నారు. అయితే, అలా జరగకుండా పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఎక్కువ స్థానాలే సాధించిందని అన్నారు. తానేమీ అనవసర ఆరోపణలు చేయడంలేదని.. తానెవరి కోసమో పని చేయడం లేదని లగడపాటి వివరించారు.
కొన్ని రోజులుగా తన వ్యక్తిత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నందున ఇప్పుడు మాట్లాడుతున్నట్టు లగడపాటి చెప్పారు. తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుందని మందే చెప్పానని అన్నారు. 15 ఏళ్లుగా తాను సర్వేలు చేస్తున్నానని, ఎప్పుడూ తన సర్వేలు తప్పు కాలేదని లగడపాటి అన్నారు. తాను ఎవరి ఒత్తిడికీ లొంగేవాడిని కానని, మాటపై నిలబడే వ్యక్తిని అని చెప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో ముందుగా సర్వే ఫలితాలు చెప్పనని, ఎన్నికలు పూర్తయ్యాకే సర్వే వివరాలు చెబుతానని లగడపాటి స్పష్టం చేశారు.