తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు పెరగనున్నాయి. ఏకంగా 15 నుంచి 20శాతం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో
తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు పెరగనున్నాయి. ఏకంగా 15 నుంచి 20శాతం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో శుక్రవారం(నవంబర్ 1,2019) నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. ఈసారి మద్యం ధరలు పెరుగుతాయని ఆబ్కారీ శాఖ సంకేతాలిచ్చింది. ఏపీలో కూడా మద్యం ధరలు పెంచిన విషయం తెలిసిందే.
ఏపీలో ఇటీవల కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చాక మద్యంపై 15 నుంచి 20 శాతం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అదే తీరులో తెలంగాణలోనూ లిక్కర్ ప్రైస్ పెంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. 20 శాతం వరకు ధర పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. కొత్త మద్యం పాలసీ ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేశాక తొలుత వ్యాపారుల నుంచి ఆశించిన మేర స్పందన రాలేదు. తర్వాత ఏపీ బోర్డర్ కి చెందిన వ్యాపారులు జోరుగా టెండర్లు దాఖలు చేశారు. మరోవైపు లైసెన్స్ ఫీజును కూడా ఆబ్కారీ శాఖ పెంచింది. ఇదివరకు రూ.లక్ష ఉన్న ఫీజును రూ.2 లక్షలు చేసిన సంగతి తెలిసిందే.
2,216 మద్యం దుకాణాల లక్కీ డ్రా ద్వారా దుకాణాదారుల ఎంపిక పూర్తవ్వగా.. కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.975.68 కోట్ల ఆదాయం వచ్చింది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేసి.. గతంలో ఉన్న నాలుగు స్లాబులను ఆరు స్లాబులకు పెంచారు. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. 5000లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.కోటి 10 లక్షల ఏడాది లైసెన్స్ ఫీజును నిర్ణయించారు. 2021 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, కొత్త మద్యం పాలసీ పేరుతో ధరలు పెంచుతారనే వార్తలు మందుబాబులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.