ఎంత డిమాండ్ : బొప్పాయి రైతులపై దళారుల దాడి

  • Publish Date - September 24, 2019 / 05:40 AM IST

హైదరాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ లో రైతులపై దళారులు దాడి చేశారు. డెంగీ ఫీవర్ తో సిటీలో బొప్పాయి విక్రయాలు పెరిగాయి. రైతులు పెద్ద ఎత్తున బొప్పాయ పండ్లను మార్కెట్ కు తీసుకొచ్చారు. అయితే దళారుల రేట్లు నచ్చక నేరుగా రైతులు విక్రయాలు జరిపారు. దీంతో బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని రైతులపై దళారులు దాడి చేశారు.

దీంతో దళారుల దాడికి రైతులు ఎదురు తిరిగారు. పరస్పర దాడులతో పండ్ల మార్కెట్ దద్దరల్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇద్దరు దళారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

గత ఏడాది ఇదే సమయానికి గడ్డిఅన్నారం మార్కెట్‌లో హోల్‌సేల్‌ వ్యాపారులు పెద్దరకం బొప్పాయి కిలో రూ.8 నుంచి రూ.10కి విక్రయించారు. అది కాస్త ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40కి పెరిగింది. దీన్ని రిటైల్‌ వ్యాపారులు కిలో రూ.80కి అమ్ముతున్నారు. సూపర్‌ మార్కెట్లలో కిలో రూ.100కి అమ్ముతున్నారు. ఇక జిల్లాల్లో పెద్దరకం బొప్పాయిలు అందుబాటులో లేవు. చిన్నసైజు బొప్పాయి ధర సైతం జిల్లాలో కిలో రూ.80కి తక్కువగా లేదు. 

కొన్ని రోజుల నుండి డెంగ్యూ వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వ్యాధి విజృంభణతో బొప్పాయి పండ్లకు డిమాండ్ తీవ్రంగా పెరిగింది. బొప్పాయి పండ్ల ధరలు కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కేజీ బొప్పాయి 100 రూపాయల వరకు ధర పలుకుతోంది. 

బొప్పాయి పండ్లు తింటే ప్లేట్ లెట్స్ ఎక్కువగా పెరుగుతాయని ప్రచారం జరుగుతూ ఉండటంతో బొప్పాయి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. రైతులు పండించిన పంటను కొత్తపేట మార్కెట్ కు తీసుకొని వచ్చిన తరువాత దళారులు ధర బాగానే ఉన్నా.. అతి తక్కువ ధరకు ఇవ్వాలని రైతులను అడిగారు. రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలను క్యాష్ చేసుకుందామని దళారులు భావించారు. దళారులు చెప్పిన ధర నచ్చని రైతులు ప్రజలకు నేరుగా అమ్మారు. 

పంట తమకు విక్రయించకుండా ప్రజలకు విక్రయిస్తూ ఉండటంతో దళారులు దాడి చేశారని తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో ప్రస్తుతం ఇక్కడ గొడవ ఆగిపోయింది. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా తక్కువ ధరలకే కొనుగోలు చేయాలనుకున్న దళారులపై అధికారులు చర్యలు తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు.