హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం : పిడుగులు, మెరుపులతో బీభత్సం

  • Publish Date - April 19, 2019 / 01:45 AM IST

హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పిడుగులు, ఉరుములు, మెరుపులతో బీభత్సం సృష్టించింది. రెండు గంటలపాటు కురిసన వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహించింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో రహదారులు చెరువులను తలపించాయి. వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉదయం వరకు రోడ్లపై నీరు నిలిచే ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌ ప్రాంతాల్లో 4 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు వీయడంతో చాలా ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. 
పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నగరమంతా అంధకారమైంది. ఇటీవల కురిసిన వర్షాల్లో ఇదే భారీ వర్షంగా చెప్పవచ్చు.