హైదరాబాద్: ముహూర్తం కుదిరింది. చేవెళ్ల సభలోనే కారెక్కడం ఖాయమైపోయింది. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. కొడుకు కార్తిక్‌కు ఎంపీ టికెట్‌తో పాటు.. సబితకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే టాక్ టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.
తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టీఆర్ఎస్‌లోకి వలసల జోరు పెరిగింది. కాంగ్రెస్ నుంచి 4గురు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు రెడీ అయిపోయారు. ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య.. గులాబీ గూటికి చేరిపోయారు. అదే బాటలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే… ఆమె మాత్రం తన నిర్ణయాన్ని వెంటనే చెప్పలేదు.
బుధవారం మధ్యాహ్నం కుమారుడు కార్తిక్‌తో కలిసి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు సబిత. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా.. కార్తిక్‌కు కాంగ్రెస్ నుంచి టికెట్ లభించలేదు. చేవెళ్ల ఎంపీ సీటు కూడా కొండా విశ్వేశ్వర్‌రెడ్డికే కేటాయిస్తారనే ప్రచారం ఉండటంతో.. కాంగ్రెస్ తీరుపై వీళ్లు గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో… ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ… టీఆర్ఎస్‌లో చేరేలా సబితా ఇంద్రారెడ్డి కుటుంబాన్ని ఒప్పించినట్లు సమాచారం. ఆమెను ఆపేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ప్రచారం జరిగింది. కానీ… అనుచరులు, కార్యకర్తల నిర్ణయం మేరకు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్‌లో చేరితే సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తానని అసెంబ్లీలోనే ప్రకటించిన కేసీఆర్… సబితకు కేబినెట్ పోస్టు ఖాయం చేసినట్టే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవితో పాటు ఆమె తనయుడు కార్తీక్ రెడ్డికి కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని టీఆర్ఎస్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి సబితా ఇంద్రారెడ్డి చేరిక పార్టీని వీడటం వల్ల రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలగా.. టీఆర్ఎస్‌కు అదనపు బలం చేకూరింది.