హైకోర్టు ముందుకి ఒక విచిత్రమైన కేసు వచ్చింది. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాలు.. న్యాయమూర్తులకు దిమ్మతిరిగేలా చేశాయి.
హైదరాబాద్ : హైకోర్టు ముందుకి ఒక విచిత్రమైన కేసు వచ్చింది. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాలు.. న్యాయమూర్తులకు దిమ్మతిరిగేలా చేశాయి. పోలీసులు బుక్ చేసిన కేసు తెలుసుకుని వారు షాక్ తిన్నారు. ఇంతకీ పోలీసులు ఏమని కేసు నమోదు చేశారో తెలుసా.. చీపురుతో కొట్టి చంపారు అని. చీపురుతో కొట్టి చంపడం ఏంటి.. కామెడీ చేస్తున్నారా అనే సందేహం వచ్చింది కదూ. మీకే కాదు.. న్యాయమూర్తులకు కూడా ఇదే డౌట్ వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. చీపురు కట్ట.. అది కూడా విరిగిపోయిన చీపురుతో కొట్టడం వల్లే ఓ మహిళ చనిపోయిందన్న పోలీసుల ఆరోపణలపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చీపురుతో కొడితే చనిపోతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొడితే చనిపోవడానికి చీపురు ఏమైనా మారణాయుధమా అంటూ ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించింది.
కరీంనగర్ జ్లిలాకు చెందిన కామాక్షి అనే మహిళను వెంకటమ్మ, ఆమె కుమారుడు రాజశేఖర్ చీపురు కట్టతో కొట్టి చంపారని పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు.. వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టులో అప్పీల్ చేశారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై విచారణ సందర్భంగా వెంకటమ్మ, రాజశేఖర్‌ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళను నడిరోడ్డుపై విరిగిన చీపురుతో కొట్టి చంపారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నివేదిక ప్రకారం పక్కటెముకలు విరిగి, బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టడం వల్ల వెంకటమ్మ చనిపోయినట్లు తేలింది. ఇది హత్య కాదు.. అని కోర్టుకి విన్నవించారు.
పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం మరోలా వాదనలు వినిపించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ మహిళది హత్యే అన్నారు. చీపురుతో కొట్టడం వల్లే చనిపోయిందన్నారు. హైకోర్టు ధర్మాసనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించలేదు. తమాషా చేస్తున్నారని అని సీరియస్ అయ్యింది. చీపురుతో మర్డర్ చెయ్యడం ఏంటని నిలదీసింది. ప్రస్తుతం ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లట్లేదని తెలిపింది. నిందితులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చీపురుతో కొట్టడం వల్లే మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా మారింది. పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత సిల్లీగా ఉంటే ఎలా అని జనాలు ప్రశ్నిస్తున్నారు.