అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్..కుదుపులు ఉండవు, ప్రమాదాలు తక్కువ.. ప్రయాణంలో పెరిగిన వేగం… 20 నిమిషాలు ఆదా…
అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్..కుదుపులు ఉండవు, ప్రమాదాలు తక్కువ.. ప్రయాణంలో పెరిగిన వేగం… 20 నిమిషాలు ఆదా… ఇవీ నారాయణాద్రి ప్రత్యేకతలు. లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్లే నారాయణాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కొత్త హంగులు దిద్దుకుంది. నిత్యం వేలాది మంది భక్తులను తిరుమలకు చేరుస్తున్న రైలుని ఆధునీకరించారు. సరికొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 1991 జనవరి 7న సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల నడుమ ప్రారంభమైన ఈ రైలు డిమాండ్‌కు అనుగుణంగా 2018 సెప్టెంబర్ 5న లింగంపల్లి వరకు పొడిగించారు.
సాధారణ బోగీలతో నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ కు మెరుగైన భద్రత కల్పించేందుకు లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను సమకూర్చారు. వీటివల్ల ప్రయాణికులు ఎలాంటి కుదుపులు లేకుండా ఎంత దూరమైన ప్రయాణించేందుకు వీలవుతుంది. అలాగే కోచ్‌లలో సౌకర్యవంతమైన సీటు, ప్రమాదవశాత్తు కాలుజారి పడకుండా ఉండేందుకు పీవీసీ ఫ్లోరింగ్ ఏర్పాటు చేశారు. బయో టాయిలెట్లు, ఏసీ బోగీల్లో లైట్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రమాదాలు జరిగిన సమయంలో కోచ్‌లు ఒకదానికొకటి ఢీకొని నష్టపరిచే అవకాశం లేకుండా, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను రూపొందించారు. మొన్నటి వరకూ ఈ రైలు పగిడిపల్లి-గుంటూరు సెక్షన్లలో డీజిల్ ఇంజిన్‌తో నడిచేది. గుంటూరులో విద్యుత్ ఇంజిన్‌ను జతచేసే వారు. తాజాగా ఈ సెక్షన్‌ను విద్యుద్దీకరించడంతో పూర్తి స్థాయిలో విద్యుత్ ఇంజిన్‌తోనే ప్రయాణం సాగుతుంది. దీంతో ప్రయాణ సమయంలో 20 నిమిషాలు తగ్గుతుంది. నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ రైలుకు ఎలక్ట్రిక్ ఇంజిన్‌తోపాటు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేయడంతో శబ్ద కాలుష్యం, కర్బన్ ఉద్గారాల విడుదల తగ్గిపోయి రైల్వేకి ఇంధన ఆదాతో ఏటా రూ.6 కోట్లు మిగులుతాయి.
లింగంపల్లిలో బయల్దేరి సికింద్రాబాద్ గుంటూరు మీదుగా తిరుపతికి రాకపోకలు సాగిస్తుంది నారాయణాద్రి ఎక్స్ ప్రెస్. బయటి దృశ్యాల్ని వీక్షించేందుకు పెద్ద గ్లాసు కిటికీలు అమర్చారు. ఏసీ బోగీల్లో చదువుకోవడానికి లైట్లు, బయటి శబ్దాలు వినిపించకుండా ఏర్పాట్లు చేశారు. సౌకర్యవంతమైన సీట్లు వచ్చాయి. సరికొత్త టెక్నాలజీ హెడ్ ఆన్ జనరేషన్ (హెచ్ఓజీ)ని నారాయణాద్రిలో ప్రవేశపెట్టారు. రైలు నడవడానికి కావల్సిన కరెంట్.. పైన ఉండే వైర్ల ద్వారా లోకోమోటివ్ లకు అందుతుంది.