మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..హింసలు వేధింపులు తగ్గటంలేదు.కానీ మహిళలు..యువతులు, బాలికల కోసం మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తున్నాయి ‘భరోసా’ సెంటర్లు. స్వచ్ఛంధ సంస్థల సహకారంతో ‘భరోసా’ సెంటర్లను నిర్వహిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. అసెంబ్లీకి సమీపంలో ప్రారంభించిన ‘భరోసా’ కేంద్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో నగరంలో పలు కేంద్రాల్లో ‘భరోసా’లను నెలకొల్పాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో సైబరాబాద్ లో కూడా కొత్తగా మరో భరోసా కేంద్రం ఏర్పాటుకానుంది.
గచ్చిబౌలిలో అన్ని సౌకర్యాలతో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రస్తుతం..కొండపూర్ ఏరియా ఆసుపత్రిలోని తాత్కాలికంగా నెలకొల్పిన ఈ భరోసా కేంద్రం ఒక సంవత్సరంగా పనిచేస్తోంది. దీనికి మంచి స్పందన వచ్చింది. కానీ డిమాండ్ కు తగినంత సిబ్బంది ఈ భరోసా కేంద్రంలో లేరు. దీంతో సిబ్బంది సంఖ్యను కూడా పెంచనున్నారు. అంతేకాదు దీన్ని పర్మినెంట్ చేయనున్నారు. శాశ్వత భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కొత్త భవనాన్ని నిర్మించాలని యోచనలో ఉన్నామని డీసీపీ, షీ టీమ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ అనుసూయ తెలిపారు.
కొత్త బిల్డింగ్ నిర్మించటనాకి గచిబౌలి ప్రాంతంలో భూమిని గుర్తించారు. త్వరలోనే బిల్డింగ్ నిర్మాణం కూడా ప్రారంభమవుతుందన్నారు. దీనికోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సిజ్జనార్ తెలిపారు.
భరోసా కేంద్రాల ఉద్ధేశ్యం
ఆపదలో ఉన్న మహిళలు..యువతులు,బాలికల కోసం భరోసా కేంద్రాలను ప్రారంభించారు. హింసతో బాధపడుతున్న మహిళలకు మద్దతు ఇవ్వడానికి భరోసా ఉద్దేశించబడింది. లైంగిక వేధింపులు, గృహ హింస వంటి పలు సమస్యలకు భరోసాలో పరిష్కారం లభించేలా అక్కడి సిబ్బంది పనిచేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాధిత మహిళలకు పోలీసు, మెడికల్, లీగల్ మరియు ప్రాసిక్యూషన్ సేవల ద్వారా సమగ్ర సహాయం అందించే కేంద్రం ‘భరోసా’. సమస్యల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించి..వారికి ధైర్యాన్ని కల్పించి.. కౌన్సెలింగ్‌తో పాటు అవసరాలకు అనుగుణంగా ఉపశమనంతో పాటు పునరావాసం కూడా ఈ భరోసా కేంద్రాలు కల్పిస్తున్నాయి. పలు కోణాల్లో మహిళలపై పెరుగున్న హింసలకు భరోసా కేంద్రాలు నిజమైన భరోసాన్ని కల్పిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు.