తెలంగాణలోని చటాన్ పల్లి దగ్గర దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని అందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు అంటున్నారు. మహిళా సంఘాలు మాత్రం ఫేక్ ఎన్ కౌంటర్ అంటున్నాయి. దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు ఎన్ హెచ్ఆర్సీ బృందం రంగంలోకి దిగింది.
నలుగురు సభ్యుల బృందం ఈ ఉదయమే (డిసెంబర్ 7,2019) ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చింది. పని ప్రారంభించింది. ముందు ఎన్ కౌంటర్ జరిగిన ప్లేస్ ను బృందం పరిశీలించింది. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లిన బృందం.. అక్కడ నిందితుల మృతదేహాలను పరిశీలించింది. గాంధీ డాక్టర్ల బృందం, పోలీసులతో మాట్లాడారు. పోస్టుమార్టం తీరుని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
తమ వెంట వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులకి పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చారు. వారితోనూ పరిశీలన చేయించారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టుపై ఎన్ హెచ్ ఆర్సీ బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయకపోతే.. మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు మృతుల కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవుల కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ ను ఎన్ హెచ్ ఆర్సీ బృందం రికార్డ్ చేయనుంది.
ఆరిఫ్ మృతదేహాన్ని అతడి తండ్రి హుస్సేన్, శివ మృతదేహాన్ని అతడి తండ్రి రాజప్ప, చెన్నకేశవుల మృతదేహాన్ని తండ్రి కురుమయ్య, నవీన్ మృతదేహాన్ని తల్లి లక్ష్మి పరిశీలించారు.