హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ : ఆ నలుగురికి కరోనా వైరస్ లేదు

హైదరాబాద్ నగర వాసులకు ఫీవర్ ఆసుపత్రి డాక్టర్లు గుడ్ న్యూస్ వినిపించారు. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు ప్రయాణికులకు చైనా జబ్బు కరోనా వైరస్ లేదని డాక్టర్లు

  • Publish Date - January 27, 2020 / 11:29 AM IST

హైదరాబాద్ నగర వాసులకు ఫీవర్ ఆసుపత్రి డాక్టర్లు గుడ్ న్యూస్ వినిపించారు. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు ప్రయాణికులకు చైనా జబ్బు కరోనా వైరస్ లేదని డాక్టర్లు

హైదరాబాద్ నగర వాసులకు ఫీవర్ ఆసుపత్రి డాక్టర్లు గుడ్ న్యూస్ వినిపించారు. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు ప్రయాణికులకు చైనా జబ్బు కరోనా వైరస్ లేదని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో నగరవాసులు రిలీఫ్ పొందారు. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నలుగురు వ్యక్తులు.. కరోనా వ్యాధి లక్షణాలతో నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో చేరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్‌ వార్డులో వారిని ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. వారి నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ రిపోర్టు వచ్చింది. ఆ నలుగురికి కరోనా వైరస్ లేదని రిపోర్టులో తేలింది.

ఈ విషయాన్ని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. ఆ నలుగురికి కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. నలుగురిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి పరీక్షించామన్నారు. వారికి జ్వరం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు లేవని వెల్లడించారు.

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ పేరు వినగానే హడలిపోతున్నారు. చైనాలో ఈ వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి చైనాలో 81 మందికి పైగా మృతి చెందారు. కాగా, కరోనా వైరస్ హైదరాబాద్‌ నగరానికి కూడా పాకిందన్న వార్తలతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

జనవరి 25న కరోనా వైరస్‌ లక్షణాలతో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్ ఫీవర్‌ ఆస్పత్రిలో చేరాడు. అతడు ఇటీవల చైనా నుంచి వచ్చాడు. అనుమానిత కరోనా కేసుగా భావించి.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్‌ వార్డులో చేర్చుకుని డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం(జనవరి 26,2020) మరో 3 కరోనా అనుమానిత కేసులు వచ్చాయి. అన్నింటిని పరీక్షించిన డాక్టర్లు.. కరోనా వైరస్ లేదని నిర్ధారించారు.

కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు : 
* ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, తల నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నలతగా అనిపించడం.
* వ్యాధి తీవ్రమైనప్పుడు ఛాతిలో నొప్పి, చలి, జ్వరం, గుండె వేగం పెరగడం, నిమోనియా, మూత్రపిండాల వైఫల్యం.