ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా?
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా? ఉద్యోగులు త్యాగానికి రెడీగా ఉండాల్సిందేనా? సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఈ అనుమానాలు కలగక మానవు. ఆదివారం(మార్చి 29,2020) కరోనాపై సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ప్రభుత్వానికి వచ్చే రాబడి గణనీయంగా పడిపోయిందన్నారు.
జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు:
ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు సీఎం కేసీఆర్. కరోనా కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా ఆదాయం కోల్పోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు కేసీఆర్.
ప్రభుత్వ ఉద్యోగులు అతీతులు కాదు, కష్టం అందరూ పంచుకోవాల్సిందే:
”ఇది చాలా పెద్ద లాస్. మొదటికే మోసం వచ్చేలా ఉంది. తెలంగాణకు కేంద్రం నుంచి రూ.12వేల కోట్లు రావాలి. మార్చి 15 నుంచి ఎక్సైజ్, పెట్రోల్, జీఎస్టీ అన్ని బంద్ అయ్యాయి. అందుకే ఎమ్మెల్యేల జీతాల కూడా బంద్ పెట్టాల్సి వస్తుందేమో. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోత విధించాల్సి వస్తే విధించాల్సిందే. ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్రంలో భాగం కాదా? కష్టం వస్తే అందరమూ పంచుకోవాలి కదా? ఇది లగ్జరీ పీరియడ్ కాదు. మనం క్రైసిస్ లో ఉన్నాము. విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి కదా. కొన్ని రోజులు చూసుకుని నడవాలి కదా. అందరూ తగ్గించుకోవాలి. తప్పదు కదా. గండం గట్టెక్కే వరకు అందరం ఊపిరి బిగపెట్టుకుని కాంప్రమైజ్ కావాలి. కరువు వచ్చినప్పుడు ఉన్నంతలో అందరం తింటాం. ఇది కూడా అంతే” అని కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ కి గురి చేశాయి. చూస్తుంటే జీతాల్లో కోత తప్పేలా లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి జీతాలు లేనట్టే అనే విషయాన్ని సీఎం కేసీఆర్ పరోక్షంగా హింట్ ఇచ్చేశారా అనే చర్చ ప్రభుత్వ ఉద్యోగాల్లో జరుగుతోంది. మొత్తంగా.. జీతాల్లో కోత విధిస్తారా? లేక జీతాలే ఇవ్వరా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.