ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఉద్దండులంతా సరికొత్త వ్యూహం రచిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అధిష్టానానికి మొర పెట్టుకుంటున్నారు. అయితే ఉన్న ఒక్క ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానంపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ ఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్సీ పదవి దక్కనుంది. దీంతో అందరి చూపు ఆ ఎమ్మెల్సీ స్థానంపైనే పడింది.
పార్టీకి దక్కనున్న ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానంపై అనేకమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆశావహుల్లో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా.. ఎవరికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే వీరిలో కొత్తగా పదవిని కోరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నా… తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన రాజకీయ ఉద్దండులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో సీనియర్ నేతలు అయిన జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్‌అలీ, జీవన్‌రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఉన్నట్లు సమాచారం.
ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు 17 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో సేఫ్‌గా ఆ ఎమ్మెల్సీ పదవి దక్కించుకుంటే.. ఆరేళ్లు పదవిలో ఉండవచ్చని సీనియర్ నేతలు భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఆ పదవిని దక్కించుకునేందుకు అందరూ లాబింగ్‌ను ముమ్మరం చేశారు. ఇప్పటికే చాలామంది నేతలు.. అధిష్టానానికి తమ విన్నపాలు పంపి.. ఈసారికి ఒక్క ఛాన్స్ తమకే ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసుకున్నారట. మరోవైపు గత ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నేతలు సైతం తమకే ఆ పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. ముఖ్యంగా సనత్‌నగర్, కరీంనగర్ అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన మర్రి శశిధర్‌రెడ్డి, నేరేళ్ల శారదలు తమకు ఈసారి అధిష్టానం న్యాయం చేస్తుందన్న ఆశతో ఉన్నారు. మొత్తానికి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం చాలామంది నేతలు క్యూ కడుతున్నారు. మరి అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.