తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం(మార్చి 12) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్ వన్‌లో పోలింగ్ కోసం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం(మార్చి 12) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్ వన్‌లో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. మరి.. ఏ పార్టీ బలం ఎంత.. ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని గెల్చుకోవాలంటే అభ్యర్థులకు ఎన్ని ఓట్లు రావాలి.
మంగళవారం(మార్చి 12) ఉదయం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ నరసింహాచారి తెలిపారు. అసెంబ్లీ దగ్గర భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఐదింటినీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ స్కెచ్ వేసింది. టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీ చేస్తూ.. ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకి కేటాయించింది. కాంగ్రెస్.. గూడూరు నారాయణ రెడ్డిని ఆరో అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో.. ఎన్నికలు అనివార్యమయ్యాయి. అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యా బలం 88. దానికి తోడు ఒక ఇండిపెండెంట్‌తో పాటు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ సంఖ్య 90కి చేరింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు రెడీ అయ్యారు. దీంతో… టీఆర్ఎస్ బలం 94కి చేరింది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే హరిప్రియ కూడా టీఆర్ఎస్‌లో చేరతానంటూ ప్రకటించారు. 7గురు మజ్లిస్ సభ్యుల బలం ఏలాగూ ఉంది. వీటన్నింటితో పాటు నామినేటేడ్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఖాతాలోకే వస్తారు. దీంతో.. ఐదింటినీ గెల్చుకుంటామని గులాబీ టీమ్ ధీమాగా ఉంది.
119 ఎమ్మెల్యేలతో పాటు నామినేటేడ్ ఎమ్మెల్యేను కలిపితే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 120. వీరంతా హాజరైతే ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రాధాన్యం కింద 21 ఓట్లు రావాలి. సభ్యులెవరైనా రాని పక్షంలో అది తగ్గుతుంది. టీఆర్ఎస్ బలం చూసినట్లయితే 88 + 7 + 2 + 1 + 4 + 1 ఇలా మొత్తం 103 మంది సభ్యుల బలముంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం ఉంది. వాళ్లిద్దరిని కూడా కలిపితే… టీఆర్ఎస్ బలం 105 కు చేరుతుంది. 21 ప్రథమ ప్రాధాన్యం ఓట్లతో 5 స్థానాలను ఈజీగా గెలుచుకోవాలంటే టీఆర్ఎస్ కు మొత్తం 105 సభ్యులు కావాల్సి ఉండగా… కాంగ్రెస్ ఇద్దరు సభ్యులు సపోర్ట్ చేస్తే.. ఐదుకు ఐదు క్లీన్ స్వీప్ చేస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని పిలుపునివ్వడంతో… టీఆర్ఎస్, ఎంఐఎంలు ఐదు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెల్చుకోవడం ఖాయమనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.