హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫలితాల వివాదంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మార్చడం దారుణం అన్నారు. 17మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం అన్న పవన్.. వారి ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై పవన్ అనుమానాలు వ్యక్తం చేశారు.
న్యాయం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులపై బోర్డు అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఇంతటి గందరగోళానికి కారణమైన ఇంటర్ బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుతారా? అని పవన్ ప్రశ్నించారు. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై పవన్ సీరియస్ అయ్యారు. అధికారుల తీరుని తప్పుపట్టారు.
Also Read : బాబోయ్ దెయ్యం : శ్రీకాకుళంలో భయం భయం
ఇంటర్ లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం తనను కలిచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు..అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. పరీక్షల కంటే జీవితాలు ముఖ్యం అని… మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవని చంద్రబాబు అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.
ఇంటర్ ఫలితాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ అయ్యారు. కొన్ని సబ్జెక్టుల్లో 95 మార్కులు వచ్చి మరికొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఈ అంశం కోర్టు వరకు వెళ్లింది. విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
Also Read : పిల్లలా ప్రొఫెషనల్ కిల్లర్సా : 9 మంది విద్యార్థుల హత్యకు బాలికల ప్లాన్