ఓయూ ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాశీంను పోలీసులు గజ్వేల్ తరలిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఓయూ ప్రొఫెసర్ కాశీం నివాసంలో శనివారం (జనవరి 18,2020) ఉదయం నుంచి దాదాపు ఐదు గంటలపాటు గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో పోలీసులు బృందం తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా కాశీం నివాసంలో పోలీసులు కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం మావోలతో కాశీంకు సంబంధాలు కొనసాగుతున్నాయని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఎట్టకేలకు కాశీంను అరెస్ట్ చేశారు. అనంతరం గజ్వేల్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో కాశీం నివాసంలో తనిఖీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ..ఓయూ విద్యార్ధులు నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2016లో సిద్ధిపేట సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలోని ఓ కారులో కాశీంకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా కొన్ని కీలక డాక్యుమెంట్లు, కరపత్రాలు పోలీసుల కళ్లబడ్డాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగించారు. దీంట్లో భాగంగా కాశీంకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా తెలిసింది. కారులో లభ్యమైన కీలక డాక్యుమెంట్లు, కరపత్రాలను కాశీం పంపిణీచేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్ కాశీం ఇటీవల విరసం కార్యదర్శిగా ఎన్నికైన క్రమంలో మరోసారి పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో మరికొన్ని కీలక డాక్యుమెంట్లు లభ్యమవ్వటంతో పోలీసులు కాశీంను అరెస్ట్ చేశారు.