సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు… విధుల్లో చేరేందుకు ఒక్కొక్కరుగా డిపోలకు చేరుకుంటున్నారు. అయితే.. వారిని విధుల్లో చేర్చుకునేది లేదని ఆర్టీసీ యాజమాన్యం
సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు… విధుల్లో చేరేందుకు ఒక్కొక్కరుగా డిపోలకు చేరుకుంటున్నారు. అయితే.. వారిని విధుల్లో చేర్చుకునేది లేదని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించడంతో… అధికారులు వారిని వెనక్కి పంపిస్తున్నారు. మరోవైపు… ముందుజాగ్రత్తగా రాష్ట్రంలోని అన్ని డిపోల దగ్గర పటిష్ట బందోబస్తు కల్పించారు. కార్మికులు ఆందోళనకు దిగకుండా, తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది ప్రభుత్వం. ప్రస్తుతం డిపోలకు చేరుకున్న వారి సంఖ్య స్వల్పంగానే ఉన్నా… సమయం గడిచేకొద్ది ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఆందోళన నెలకొంది.
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అన్ని డిపోలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లాల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు సోమవారం(నవంబర్ 25,2019) సాయంత్రమే పోలీసు భద్రతను కోరారు. ఈ నేపథ్యంలో అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమ్మె ఉధృతమైన సమయంలో కొన్ని డిపోల్లో ఏర్పాటు చేయగా, మిగతావాటిలోఇప్పుడు ఏర్పాటు చేశారు. డిపోల దగ్గర బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కార్మికులు డిపోల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతల ప్రకటన హాస్యాస్పదమని ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్‌శర్మ అన్నారు. ఇష్టమొచ్చినపుడు గైర్హాజరై.. ఇప్పుడు చేరతామంటే కుదరదని అన్నారు. ఇష్టానుసారం చేస్తామంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సాధ్యం కాదని చెప్పారు. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సునీల్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అశ్వత్థామరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్‌ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ ఈ ఘటనకు పాల్పడ్డాడు.
అశ్వత్థామరెడ్డి ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయాడని ఆరోపించారు. 52 రోజుల పాటు సమ్మె పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటమాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అశ్వత్థామరెడ్డి నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన రవినాయక్.. సోమవారం రాత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.