ఓ వైపు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది.. మరోవైపు కేరళలో ఓ ఐజీ రేంజ్ అధికారి తన పదవికి రిజైన్ చేయబోతున్నారట. ఇద్దరికీ లింక్ ఏంటని
ఓ వైపు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది.. మరోవైపు కేరళలో ఓ ఐజీ రేంజ్ అధికారి తన పదవికి రిజైన్ చేయబోతున్నారట. ఇద్దరికీ లింక్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కేటీఆర్ సీఎం అయితే.. ఐటీ శాఖలోకి వచ్చేది ఆయనేనట. ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు..? సడెన్‌గా సీన్‌లోకి ఎలా వచ్చారు..?
కేబినెట్ లో మార్పులు చేర్పులు:
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారనే చర్చ జోరుగా నడుస్తోంది. రాబోయే రెండు నెలల్లో పట్టాభిషేకం కూడా ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పాలనా సంస్కరణలు మొదలయ్యాయని.. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని గులాబీనేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ ఆరుగురు మంత్రులు ఔట్..?
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ప్రతీ ఎన్నికలో గెలుపు బాధ్యతలు తన భుజాలపై వేసుకుని సక్సెస్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 90కి పైగా స్థానాలను గెలిచిందంటే అది కేటీఆర్ ఘనతే. అటు ఐటీ మంత్రిగానూ తనదైన ముద్ర వేశారు. తన అనుభవంతో భారీగా పెట్టుబడులు సాధించడంలో విజయవంతం అయ్యారు కేటీఆర్. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమేనంటున్నారు సొంత పార్టీ నేతలు. అదే నిజమైతే ఎవరెవరు కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపడుతారు..? ఎవరెవరికి పదవులు ఊడుతాయనే చర్చ నడుస్తోంది. ఐదారుగురు మంత్రులపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్లందర్ని పదవి నుంచి తొలగిస్తారని సమాచారం.
ఐటీ మంత్రిగా లక్ష్మణ్ నాయక్?
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగితే కేరళలో ఐజీ ర్యాంక్ అధికారి లక్ష్మణ్ నాయక్ కు బెర్త్ ఖాయమనే ప్రచారం నడుస్తోంది. కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే.. ఐటీ మంత్రిగా లక్ష్మణ్ నాయక్‌కే ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు లక్ష్మణ్ నాయక్ తన పదవికి రాజీనామా చేసి.. త్వరలోనే ఇక్కడికి వస్తారని కొంతమంది సీనియర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మలయాళ పత్రికలు ప్రచురించేశాయి కూడా. 14 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికీ పదవీ విరమణ చేస్తున్నానని కేరళ డీజీపికి ఇప్పటికే సమాచారం ఇచ్చారట లక్ష్మణ్. తెలంగాణ కేబినెట్‌లో ఐటీ శాఖ తనకు అప్పగించే అవకాశం ఉందని కూడా చెప్పారట. దీంతో కేటీఆర్ సీఎం కావడం… ఆయన ఖాళీ చేసే ఐటీ శాఖను లక్ష్మణ్ చేపట్టడం ఖాయమేనంటున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ కుమార్తె కవితను వివాహం చేసుకున్న లక్ష్మణ్.. చాలా కాలంగా టీఆర్‌ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. కేసీఆర్ కేరళ వెళ్లినప్పుడు కూడా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు.
కేబినెట్‌లో ఒకరిపై వేటు తప్పదా?
ఒక వేళ కేటీఆర్‌ను సీఎం చేయకపోయినా.. లక్ష్మణ్ నాయక్ ను కేబినెట్ తీసుకోవాలనే ఉన్నారట కేసీఆర్. అలా చేయాలంటే ఇప్పటికే కేబినెట్‌లో ఉన్న ఎవరో ఒకరిపై వేటు వేయక తప్పదు. పైగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులపై ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న కేసీఆర్.. వారిని తొలగించి.. కొత్త టీమ్‌ను సిద్ధం చేయవచ్చన్న ప్రచారమూ సాగుతోంది. కాగా, కేరళ మాజీ డీజీపీ మూషాహరి మేఘాలయ గవర్నర్ గా 2008 నుంచి 2013 వరకు విధులు నిర్వహించారు.
* కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖాయమైందా?
* కేటీఆర్ కేబినెట్‌పై అప్పుడే మొదలైన ఊహాగానాలు
* ఐటీ మంత్రిగా లక్ష్మణ్ నాయక్‌కు బాధ్యతలు..!!
* కేరళలో ఐజీ ర్యాంక్ అధికారిగా పనిచేస్తున్న లక్ష్మణ్ నాయక్
* మాజీ ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ కుమార్తెతో లక్ష్మణ్ వివాహం
* టీఆర్‌ఎస్ నేతలతో లక్ష్మణ్ నాయక్‌కు సన్నిహిత సంబంధాలు
* ఐదారుగురు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి
* వారిని తొలగించి కొత్తవాళ్లకు అవకాశమిస్తారనే ప్రచారం