హైదరాబాద్ : ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లో నోట్ల కట్టల కలకలం చెలరేగింది. భారీగా నగదు పట్టుబడుతోంది. బంజారాహిల్స్ లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.3కోట్ల 20లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఓ కారులో తరలిస్తుండగా నగదుని సీజ్ చేశారు. ఆ కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ డబ్బు ఎవరిది? అన్నది ఆరా తీస్తున్నారు.
మరో ఘటనలో రూ.29.84 లక్షల నగదు పట్టుబడింది. అమీర్ పేట్ లోని ధరమ్ కరమ్ రోడ్ లో పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీల్లో ఈ డబ్బు లభ్యమైంది. ఓ వాహనంలో డబ్బుని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ నగదుని సీజ్ చేశారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి తరలిస్తున్నారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
ఎన్నికల వేళ కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల సోదాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. లెక్కల పత్రాలు లేని క్యాష్ బయటపడుతోంది. దీంతో పోలీసులు ఆ డబ్బుని స్వాధీనం చేసుకుంటున్నారు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థ ఉద్యోగుల నుంచి పోలీసులు రూ.2కోట్లు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. MMTS లో డబ్బు తరలించే ప్రయత్నంలో ఉండగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. అది మరువక ముందే అంతకన్నా ఎక్కువ మొత్తం పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ఈ డబ్బు ఏదన్నా పార్టీకి సంబంధించినదా? పార్టీ అభ్యర్థి కోసం తరలిస్తున్నారా? అనే కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.