తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. అయితే పోలింగ్, కౌంటింగ్ మధ్య 40 రోజుల గడువుండటం… రాజకీయాల్లో పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ముఖ్యంగా స్ట్రాంగ్‌రూముల్లో భద్రతపై అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తోంది. అసలు.. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను ఎలా తరలిస్తారు? 40 రోజుల పాటు ఎలా భద్రంగా కాపాడుతారు? స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయి?
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పనితీరు ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి భద్రతపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల తరలింపు దగ్గరి నుంచి వాటిని స్ట్రాంగ్‌రూమ్‌లకు చేర్చడం.. అక్కడ తగిన భద్రత కల్పించడం ఎన్నికల కమిషన్‌కు కత్తిమీద సామే. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు హోటళ్లలో ప్రత్యక్షం కావడం.. ఓ ఎమ్మెల్యే ఇంట్లో కనిపించడం.. హైవే రోడ్లపై దర్శనమివ్వడం అనేక ఆరోపణలకు తావిచ్చింది. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎన్నికల సంఘం ఈవీఎంల తరలింపు.. వాటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది.
తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసిన చాలా రోజులకు కౌంటింగ్ జరుపుతున్నారు. పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు మధ్య 40 రోజులకుపైగా గడువు ఉండటం కూడా.. పార్టీల్లో, పోటీ చేసిన అభ్యర్థుల్లో పలు అనుమానాల్ని రేకెత్తిస్తోంది. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంల భద్రతపై రాజకీయ పార్టీల కార్యకర్తలు సైతం దృష్టిపెట్టాల్సి వస్తోంది. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే విషయాన్ని బయటపెట్టడానికి కార్యకర్తలంతా నిద్రాహారాలు మాని అక్కడ కాపాలా కాయాల్సి వస్తోంది. గతంలో అనేకసార్లు స్ట్రాంగ్‌రూములలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. దీంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చింది. వీటిని మే 23 వరకు భద్రపర్చాల్సి ఉంటుంది. 40 రోజులకు పైగా అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. ప్రజా తీర్పును సురక్షితంగా కాపాడేందుకు… ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర మూడు అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఈవీఎంల తరలింపు అత్యంత కీలకమైన అంశం. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ఎన్నికల కోసం అద్దెకు తీసుకున్న ప్రైవేటు వాహనాలను వినియోగిస్తారు. వీటి జాడను అనుక్షణం పర్యవేక్షించేందుకు జీపీఎస్ సిస్టమ్ అమరుస్తారు. ఈవీఎంలను తరలించే వాహనాల్లోనే ప్రిసైడింగ్ అధికారులు కూడా ప్రయాణిస్తారు. ఆయా వాహనాలకు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తారు. ఈవీఎంల వెంట ప్రయాణించే అధికారుల్లో కొందరు బాడీ కెమెరాలను ధరిస్తారు. అలాగే వాహనాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తారు.
ఇక… ఎన్నిక తర్వాత ప్రత్యేక బాక్సుల్లో భద్రపర్చిన ఈవీఎంలను, వీవీ ప్యాట్లను… స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిస్తారు. అంతకుముందు ఆయా బాక్సులకు పోలింగ్ అధికారులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ వేస్తారు. ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరిన వెంటనే అక్కడి గదుల్లోని ద్వారాలు, కిటికీలను మూసేసి… వాటికి సీల్ వేస్తారు. ఆయా కేంద్రాల దగ్గర 24 గంటలపాటు సాయుధ బలగాలతో పికెటింగ్ ఏర్పాటు చేస్తారు. స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతను జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షిస్తుంటారు. అయితే స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర ఎంతమంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారన్న విషయాన్ని బయటకు తెలియకుండా చూసుకుంటారు.
మొత్తానికి పోలింగ్ పూర్తయిన రోజు నుంచి కౌంటింగ్ వరకు… ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రంగా ఉంటాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. స్ట్రాంగ్‌రూముల్లో భద్రతపై పార్టీలకు, అభ్యర్థులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని భరోసా ఇస్తున్నారు.