ఉల్లి సామాన్యులకు కన్నీరు తెప్పించేదిగా మారింది. రోజూ పెరుగుతున్న ధరలు చూసి మధ్యతరగతి మనుషులు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో మేలిరకం ఉల్లిపాయలు ఒక్కో క్వింటా రూ.6 వేలు పలికింది. గత నెలలో రూ.1971 ఉన్న ఉల్లి ఏకంగా మూడురెట్లుకు పైగా పెరగడం ఆశ్యర్యకరమే. మహారాష్ట్ర నుంచి వచ్చే పెద్ద ఉల్లిపాయలు కిలో రూ.60 పలుకుతుండగా, దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో రూ.80కు చేరింది.
ధరలను అదుపులోకి తీసుకురావాలని విదేశాల నుంచి లక్ష టన్నుల దిగుమతికి కేంద్రం అనుమతివ్డంతో పాటు వాటిని నిల్వ చేసేందుకు నాణ్యత ప్రమాణాలను సడలించింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుచేసిన ఉల్లి పంట వర్షాలకు దెబ్బతినడం వల్ల 10 లక్షల టన్నుల వరకు దిగుబడి తగ్గుతుందని అంచనా. ఇలా జరిగితే ఉల్లి ధర మరింత ప్రియం కావడం ఖాయం.
తెలంగాణలో ఖరీఫ్‌లో 12 వేల ఎకరాలు, రబీలో 20 వేల ఎకరాల వరకు ఉల్లి సాగవుతుంది. మరో మూడు నాలుగు రోజుల్లో కిలో ఉల్లి రూ.100లకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. ఏపీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి భారీమొత్తంలో ఉల్లిని స్వాధీనం చేసుకున్నారు.
సామాన్యులకు తక్కువ రేటుకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 673 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని 85 రైతుబజార్లలో స్వయం సహాయక బృందాల ద్వారా కిలో రూ.25లకు విక్రయించనున్నారు.