అలర్ట్ : హైదరాబాద్‌లో నేడు కూడా గాలివాన బీభత్సం

  • Publish Date - April 23, 2019 / 03:43 AM IST

హైదరాబాద్ లో సోమవారం (ఏప్రిల్ 22,2019) గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు హడలెత్తించాయి. హైదరాబాద్ లో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా నలుగురు చనిపోయారు. గాలి వాన బీభత్సానికి నగరవాసులు వణికిపోయారు. ఇలాంటి పరిస్థితి మంగళవారం(ఏప్రిల్ 23,2019) కూడా రావొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

దక్షిణ మరట్వాడా నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 1.5కి.మీ. ఎత్తు లో ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ దాని పరిసరాల్లో సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి విదర్భ, మరట్వాడా మీదుగా ఉత్తర ఇటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 0.9కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏప్రిల్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఆ తర్వాత 24గంటల్లోగా అది వాయుగుండంగా మారొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు