ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయానికి గురైన ఇంటర్ విద్యార్థిని మధులికు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఏడాది కాలం నుంచి తీవ్రంగా వేధిస్తున్న భరత్ హద్దు మీరి పైశాచికత్వాన్ని చూపించాడు. పొరుగింట్లో ఉంటున్న భరత్ వేధింపులు భరించలేక జనవరి 7వ తేదీన భరోసా కేంద్రంలో మధులిక పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. భరత్‌ను పిలిపించిన అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
అయినా తీరు మార్చుకోని భరత్.. వేధింపులు తీవ్రం చేశాడు. విషయాన్ని మధులిక బాబాయి పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు. దాంతో ఆవేశంలో విచక్షణ కోల్పోయాడు భరత్. అదును చూసుకుని ఫిబ్రవరి 6 బుధవారం మధులికపై దాడి చేశాడు. కత్తితో వస్తున్న భరత్‌ను చూసి మధులిక భయంతో వణికిపోయింది. పారిపోయే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
రెచ్చిపోయిన భరత్.. కొబ్బరి బొండాల కత్తితో ఆమెపై విరుచుకుపడ్డాడు. కత్తితో చేసిన దాడిలో మెడపై తీవ్రంగా గాయమైంది. ఈ క్రమంలోనే ఆమె చేతి వేళ్లు తెగిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు మధులికను యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన కుటుంబ సభ్యులు భరత్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.