అమెరికా కోర్టులో తెలుగు విద్యార్ధులకు ఊరట

  • Publish Date - February 13, 2019 / 08:03 AM IST

వాషింగ్టన్: ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వేలాదిమంది విద్యార్ధుల ఆశలను తుడిచిపెట్టేసింది. వందలాది తెలుగు విద్యార్ధుల జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన 20 మంది విద్యార్థులకు అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఫిబ్రవరి 26లోగా దేశం విడిచి వెళ్లేందుకు అమెరికా కోర్టు అనుమతించింది. 20 మందిలో ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు భారతీయులు, ఒక పాలస్తీనా దేశానికి చెందినవారు ఉన్నారు. ముందుగానే వాలంటరీ డిపార్చర్ అంటే స్వచ్ఛందంగా స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్ట్ అయిన విద్యార్థుల తుది వాదనలు ఫిబ్రవరి 12న ముగిశాయి. ఈ క్రమంలో 20 మందిలో 17 మందిపై మంగళవారం విచారణ జరిగింది. 

17 మంది విద్యార్ధుల్లో 15 మందికి స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లే అవకాశాన్ని అమెరికా కోర్టు కల్పించింది. 15 మందిలో 8 మంది తెలుగు విద్యార్థులే. 16వ విద్యార్థికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం ఇచ్చినప్పటికీ స్వచ్ఛందంగా కాకుండా యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ కింద వెళ్లేందుకు అనుమతించింది. 

మొత్తం 16 మంది విద్యార్థులు కోర్టు తీర్పు మేరకు వాలంటరీగా ఫిబ్రవరి 26లోగా యూఎస్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్ధులు వారి వారి దేశాలకు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్ల విషయంలో సహకరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. విద్యార్థుల తరఫున వాదించేందుకు ఆటా-తెలంగాణ అటార్నీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.