తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మహిళా కండక్టర్లకు ఊరట కలిగింది. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే విధులు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మహిళా కండక్టర్లకు ఊరట కలిగింది. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే విధులు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని అన్ని రీజియన్ల మేనేజర్లకు ఎండీ బుధవారం (డిసెంబర్ 4, 2019) ఆదేశాలు జారీ చేశారు.
మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటల లోపు డిపోలకు చేరేలా పని వేళలను సవరించాలని సూచించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తీసుకున్న చర్యలను డిసెంబర్ 8 వ తేదీలోపు ఎండీ కార్యాలయానికి తెలిపాలని కోరారు. 50 రోజులకు పైగా సమ్మె చేసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ డిసెంబర్ 1 వ తేదీన ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు.
రాత్రి 10 గంటల తర్వాత కూడా తాము విధులు నిర్వహించాల్సివస్తోందని మహిళా కండక్టర్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారి విధులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మహిళా కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.