ఆర్టీసీ సమ్మె అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మె యథాతథంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం
ఆర్టీసీ సమ్మె అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మె యధాతథంగా కొనసాగుతోందన్నారు. సమ్మె విరమిస్తామని చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ విషయంలో ఇంకా వేచి చూస్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. శనివారం(నవంబర్ 23,2019) ప్రతి డిపో ముందు ర్యాలీ చేపడతామన్నారు. సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు చేస్తామన్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఆర్టీసీ కార్మికుల కష్టాలు తెలియజేస్తామన్నారు.
ఆర్టీసీ జేఏసీ చేసిన సమ్మె విరమణ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరం అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందన్నారు. కోర్టు తీర్పు గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు విధుల్లో చేరినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. కార్మికులెవరూ విధుల్లో చేరలేదని చెప్పారు. కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు.
డ్యూటీలు ఇవ్వాలని డిపోలకు వెళ్లొద్దన్నారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకునే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే.. మరోసారి సమావేశం అవుతామని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వం చెబుతున్నట్టు కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగలేదన్నారు.