ఆర్టీసీ జేఏసీ నాయకులు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు.
టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు శనివారం (నవంబర్ 16, 2019) హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం దగ్గర దీక్ష తలపెట్టారు. బస్ రోకోలు, దీక్షలు తలపెట్టిన క్రమంలో నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఎల్బీ నగర్ లో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు. బయటకి వస్తే మాత్రం అరెస్టు చేసే అవకాశం ఉంది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ జేఏసీ ముఖ్య నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. అటు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం దగ్గ భారీగా పోలీసులను మోహరించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు.. ఇందిరా పార్క్ దగ్గర చేయతలపెట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వీఎస్‌టీ సమీపంలోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో దీక్ష చేయాలని నిర్ణయించారు.
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు శనివారం నిరాహార దీక్ష తలపెట్టారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ దీక్ష చేయనున్నారు. వీఎస్‌టీ దగ్గర ఉన్న ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేయాలని ఈ నలుగురు నేతలు నిర్ణయించారు. అలాగే ఇవాళ రాష్ట్రంలోని బస్ డిపోల ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు.
అనుమతి నిరాకరించడంతో బస్ డిపోల ఎదుట ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు కాబట్టి ఎవరైనా బయటికి వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. అన్ని డిపోల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో ఈయూ కార్యాలయం దగ్గర పోలీస్ నిఘా పెంచారు. అలాగే బందోబస్త్ ఏర్పాటు చేశారు. మరోవైపు ముందస్తు అరెస్టులను జేఏసీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.