సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తేల్చి చెప్పారు. సమస్యలపై ప్రభుత్వం చర్చించకుండా విధుల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్మికులు
సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. సమస్యలపై ప్రభుత్వం చర్చించకుండా విధుల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడొద్దని.. ఉద్యోగాలు తొలగించే అధికారం ఎవరికీ లేదని అశ్వత్థామరెడ్డి అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే యూనియన్లు రద్దు చేసుకుంటామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను చర్చలకు పిలవాలని.. లేబర్ యాక్ట్ ప్రకారం చర్చలు జరపాలన్నారు. సీఎం కేసీఆర్ వార్నింగ్ కు భయపడి కార్మికులెవరూ తిరిగి విధుల్లో చేరొద్దని అశ్వత్థామరెడ్డి కోరారు. ధైర్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మద్రోహం చేసుకుని విధుల్లో చేరాల్సిన అవసరం లేదన్నారు. కాగా, నిరుద్యోగుల విజ్ఞప్తితో నవంబర్ 5న చేయాలనుకున్న సడక్ బంద్ వాయిదా వేసుకున్నట్టు చెప్పారు.
ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలు అన్నందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు జేఏసీ నేతలు. నవంబర్ 5లోగా ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అశ్వత్థామరెడ్డి.. సమస్యలపై చర్చించాకే విధుల్లో చేరతామన్నారు. 5వేల బస్సులు ప్రైవేట్ కు ఇస్తే.. 5వేల బస్సులు మాత్రమే మిగులుతాయన్నారు. 5వేల బస్సులకు 27వేల మంది కార్మికులే అవసరం అవుతారని.. మరి మిగతా 23వేల మంది కార్మికులను ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తమ సమస్యలను పరిష్కరిస్తేనే.. యూనియన్లను వైండప్ చేస్తామన్నారు. కార్మికులను భయపెట్టే ధోరణిలో సీఎం మాట్లాడారని జేఏసీ నేతలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం(నవంబర్ 3,2019) టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, సీఎం కేసీఆర్ కామెంట్స్ పై చర్చించారు. ఉద్యోగుల పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోందని జేఏసీ నేతలు ఆరోపించారు. నవంబర్ 4 నుంచి డిపో మేనేజర్లు సమ్మెకు మద్దతివ్వాలని జేఏసీ నేతలు కోరారు.