ఎల్లుండి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.
ఎల్లుండి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఐఏఎస్‌ల కమిటీతో రెండో రోజు కూడా చర్చలు విఫలం కావడంతో… సమ్మె జరిపి తీరుతామని స్పష్టం చేసింది. త్రిసభ్య కమిటీ తమ డిమాండ్లపై నిర్దిష్టమైన హామీ ఇవ్వడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు.
మమ్మల్ని చర్చల కోసం పిలిచి…ఆర్టీఏతో ప్రత్యామ్నాయంపై ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకే తమ పోరాటమన్నారు అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ కమిటీకి.. కార్మిక సంఘాలకు మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. రెండోరోజు చర్చల్లో ఇంకా క్లారిటీ రాలేదు. 26 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికసంఘాలు పట్టుబట్టాయి. మరోవైపు సమ్మెపై పునరాలోచించాలని కార్మిక సంఘాలకు కమిటీ సూచిస్తోంది. సమ్మె అనివార్యమైతే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. అనుభవం ఉన్న డ్రైవర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ప్రాథమికంగా సూచించారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
చర్చలకు పిలిచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమావేశం నుంచి కార్మిక సంఘాల నేతలు బయటకు వెళ్లిపోయాయి. అయితే.. సమ్మె జరిగితే ఏం చేయాలన్న దానిపై కమిటీ చర్చించడంతో ఆగ్రహించిన కార్మిక సంఘాలు మధ్యాహ్నం చర్చలను బహిష్కరించాయి. తిరిగి అధికారులు పిలవడంతో.. మళ్లీ భేటీ అయ్యి.. డిమాండ్లను పరిష్కరించాలని కోరాయి. ఈ చర్చలకు టీఎంయూ, ఈయూ నేతలు హాజరయ్యారు.